పోస్టింగ్ ఇవ్వకుంటే ఆందోళనలే:జూ.పంచాయతీ కార్యదర్శులు

పోస్టింగ్ ఇవ్వకుంటే ఆందోళనలే:జూ.పంచాయతీ కార్యదర్శులు

హైదరాబాద్, వెలుగు: జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికై పోస్టింగ్ దక్కని ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వరుస ఎలక్షన్ల కారణంగా ఇప్పటికాకా సైలెంట్​గా ఉన్నామని, ఇక పోరాటం చేస్తామని వారు చెబుతున్నారు. సర్కారు పట్టించుకోకుంటే నిరాహార దీక్షలకు దిగుతామని, రాజకీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కోరుతామని అంటున్నారు.

రెండు నెలలుగా..

గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. పలు వివాదాలు, కోర్టు కేసుల కారణంగా నియామకాలు ఆలస్యమయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 11న లోక్ సభ ఎన్నికలు పూర్తవడం, హైకోర్టు, నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో.. కార్యదర్శులుగా ఎంపికైన వారికి జిల్లా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, ఎమ్మార్వోలు నియామక పత్రాలు ఇచ్చారు. అయితే ఉద్యోగానికి ఎంపికైనా కూడా సుమారు 500 మందికి మాత్రం నాన్ లోకల్ పేరుతో పోస్టింగ్ లు ఇవ్వలేదు. దీంతో వారంతా ఆందోళనలో పడ్డారు. రెండు నెలల్లో పలుసార్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ జోషి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ రాజ్, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ తదితరులను కలిసి.. తమకు పోస్టింగ్​లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినా, వేసవి సెలవుల కారణంగా అవి విచారణకు రాలేదు. అయితే మే 27 వరకు లోక్ సభ ఎలక్షన్​ కోడ్ ఉండటం, స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులంతా సైలెంట్​గా ఉండిపోయారు. ఇప్పుడవన్నీ ముగియడంతో ఆందోళనలకు దిగేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.

నేతల మద్దతు కోసం ప్రయత్నాలు

పోస్టింగ్​లు దక్కని అభ్యర్థులు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, నేతలను కలిసి మద్దతు కోరాలని ప్రయత్నిస్తున్నారు. తొలుత పంచాయతీరాజ్​ మంత్రిని, అధికారులను కలిసి తమ గోడు చెప్పుకొంటామని, సానుకూల స్పందన రాకపోతే ఆందోళనకు దిగుతామని చెప్తున్నారు. అవసరమైతే ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు, నిరాహార దీక్షలకు దిగుతామని అంటున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శి అప్లికేషన్ దాఖలు చేసే సమయంలో నాన్ లోకల్ కాలమ్ దగ్గర ప్రస్తుతం నివాసం ఉంటున్న జిల్లాను పేర్కొన్నామని, అప్పుడు ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికగా తీసుకుని, తర్వాత కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకోవటంతో నాన్ లోకల్​ వివాదం మొదలైందని అభ్యర్థులు చెబుతున్నారు. అధికారులేమో ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్న జిల్లాను పరిగణనలోకి తీసుకున్నారని, కొన్ని ఉమ్మడి జిల్లాలు 3, 4 జిల్లాలుగా విడిపోయాయని అంటున్నారు. వేరే జిల్లాలో పోస్టింగ్ ఇచ్చినా ఉద్యోగంలో చేరుతామని చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

చాలా పోస్టులు ఖాళీయే!

రాష్ట్రవ్యాప్తంగా ఆఫర్ లెటర్లు తీసుకున్న వారిలో చాలా మంది విధుల్లో చేరలేదు. మూడేళ్ల పాటు కాంట్రాక్టు పద్ధతిలో రూ.15 వేల వేతనంతో ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించింది. పనితీరు సంతృప్తికరంగా ఉంటేనే తర్వాతి ఏడాదికి రెన్యువల్ చేస్తామని.. విధులు, అధికారాల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సీఎం కేసీఆర్ కూడా హెచ్చరించారు. ఉద్యోగంలో చేరాక యూనియన్లుగా ఏర్పాటైనా, ఉద్యోగ భద్రత లేదని కోర్టులకు వెళ్లినా సస్పెండ్ చేస్తామని ఒప్పంద పత్రాలు రాయాలని నిబంధన పెట్టారు. చాలా మంది నిబంధనలు చూసి వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. ఇక పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికైన వారిలో కొందరు జూనియర్ పంచాయతీ కార్యదర్శి పరీక్షతోపాటు, కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్–2, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వంటి పరీక్షలకు హాజరయ్యారు. ఆయా పోస్టులకు ఎంపికైన వారు, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు కార్యదర్శి ఉద్యోగాల్లో చేరలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.