కాలేజీలు అఫిలియేషన్కు అప్లై చేస్తలే

కాలేజీలు అఫిలియేషన్కు అప్లై చేస్తలే

గడువు ముగిసినా ముందుకు రాని ప్రైవేట్ కాలేజీలు
ఈ నెల 20 వరకు గడువు పొడిగించిన ఇంటర్ బోర్డు
సర్టిఫికెట్లు కావాల్సిందేనని మేనేజ్మెంట్లకు సూచన
కరోనా టైంలో సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని కాలేజీల ఆందోళన

హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు ఇంటర్ కాలేజీలు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడం లేదు. గడువు ముగిసినా, బోర్డు గడువు పొడిగించినా ముందుకు రావట్లేదు.అఫిలియేషన్కు.. ఫైర్,శానిటరీ సహా అన్ని సర్టిఫికెట్లు తప్పనిసరిగా కావాల్సిందేనని ఇంటర్ బోర్డు చెబుతుండగా.. కరోనా టైంలో అధికారులు ఇవ్వడం లేదని ప్రైవేట్ కాలేజీల మేనేజ్ మెంట్లు అంటున్నాయి. నిరుడు గుర్తింపు ఉన్న కాలేజీలన్నింటికీ అఫిలియేషన్ను రెన్యూవల్ చేయాలని కోరుతున్నాయి. బోర్డు మాత్రం అదంతా కుదరదని తేల్చి చెప్పింది. సర్టిఫిర్టికెట్లన్నీ ఉంటేనే అఫిలియేషన్ ఇస్తామని కరాఖండిగా చెప్పేసింది. ఈ నేపథ్యంలోనే అఫిలియేషన్ దరఖాస్తు గడువు ముగిసినా కాలేజీలు మాత్రం అప్లై చేసుకోలేదు. గడువును జూన్ 20 వరకు పెంచింది ఇంటర్ బోర్డు.

అఫిలియేషన్ ఫీజు పెంపు
రాష్ట్రంలో మొత్తం 2,558 జూనియర్ కాలేజీలున్నాయి. అందులో ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు 1,583, సర్కారు 404, ఎయిడెడ్ కాలేజీలు 41 ఉండగా, 530 గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ఇప్పటిదాకా 200 కాలేజీలు మాత్రమే అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అవి కూడా సర్కారు గురుకులాలే. నిజానికి కరోనా లాక్డౌన్తో అఫిలియేషన్ ప్రాసెస్ కొంచెం లేట్ గా మొదలైంది. అఫిలియేషన్ దరఖాస్తులకు మే 19న ఇంటర్ బోర్డు నోటిఫికేషన్ విడుదలచేసింది. జూన్ 10ని చివరి తేదీగా నిర్ణయించింద. అఫిలియేషన్ కోసం ఫైర్ సేఫ్టీతోపాటు శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్ నెస్ సర్టిఫికెట్ కావాలని సూచించింది. అయితే, కరోనా డ్యూటీల్లో ఉన్నామంటూ వివిధ శాఖల
అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని మేనేజ్మెంట్లు ఆరోపిస్తున్నాయి. అంతేగాకుండా గతంతో పోలిస్తే అఫిలియేషన్ ఫీజును 60% పెంచాయని అంటున్నాయి. కరోనా టైంలో ఫీజులు కూడా సరిగ్గా వసూలు కాలేదని, పెంచిన ఫీజును తగ్గించాలని కోరుతున్నాయి. ఈ ఏడాది సర్టిఫికెట్లు, అఫిలియేషన్ నుంచి మినహాయింపును ఇచ్చి పోయినేడాది గుర్తింపున్న కాలేజీలకు రెన్యూవల్ చేయాలని విద్యాశాఖమంత్రి సబితాతో పాటు అధికారులనూ కోరాయి. అయితే, అఫిలియేషన్ ఫీజును తగ్గించిన బోర్డు.. సర్టిఫికెట్లు మాత్రం కావాల్సిందేనని తేల్చి చెప్పింది.

పోయినేడాది కాలేజీలను రెన్యూవల్ చేయాలె
కరోనా టైంలో అన్ని యూనివర్సిటీలూ ఎలాంటి తనిఖీలు లేకుండానే కాలేజీలను రెన్యూవల్ చేస్తున్నాయి. ఇంటర్ బోర్డు అడుగుతున్న సర్టిఫికెట్లను గత కొన్నేళ్లుగా ఇస్తూనే ఉన్నాం. కానీ, ఈ ఏడాది వాటిని తీసుకుందామంటే అధికారులు అందుబాటులో ఉండట్లేదు. కాబట్టి పోయినేడాది గుర్తింపు ఇచ్చిన కాలేజీలన్నింటికీ అఫిలియేషన్ రెన్యువల్ చేయాలి. కాలేజీలు వేరే చోటుకు షిఫ్ట్ అయితే ఆ సర్టిఫికెట్లు అడిగినా ఓకే. కానీ, ఏళ్ల తరబడి అక్కడే ఉంటున్న కాలేజీలకు ఎందుకు? సర్కారు దీనిపై సానుకూలంగా స్పందించాలి.
– గౌరీ సతీశ్, స్టేట్ ప్రెసిడెంట్, ప్రైవేటు జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ల సంఘం

For More News..

సీఎంను కలవాలనుకున్న బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

షరతుల సాగుకు బయో పెస్టిసైడ్స్ రెడీ

ఏనుగులకు 5 కోట్ల ఆస్తి రాసిచ్చిన జంతు ప్రేమికుడు