హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ హైదరాబాద్ జిల్లాల్లోని పలు కార్పొరేట్ జూనియర్ కాలేజీలు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ కాలేజీలలో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన వారం రోజులకే తరగతులు ప్రారంభించాయి. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులను ప్రకటించింది. అయినప్పటికి కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలల విద్యార్థులు తరగతులకు హాజరుకావలసి వస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్ కాలేజీలు సీనియర్ విద్యార్థులకు తరగతులను కొనసాగిస్తున్నాయని, అలాంటి చర్య ప్రభుత్వ అకాడమిక్ క్యాలెండర్‌కు వ్యతిరేకం కావడమే కాకుండా విద్యార్థుల ఆరోగ్యానికి, శ్రేయస్సుకు ముప్పు కలిగిస్తుందని తల్లిదండ్రులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఇంటర్మీడియట్ క్లాసులు జూన్ 1 నుంచి స్టార్ట్ కావాల్సి ఉంది.
కానీ ఈ సంస్థలు ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి.. విద్యార్థులకు విరామం ఇవ్వకుండా అనవసరమైన ఒత్తిడి తెస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వ నింబంధనలను ధిక్కరిస్తున్న ఇలాంటి ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
