ఇంటర్ కాలేజీలు.. ర్యాంకులన్నీ మావే అంటే చర్యలు తప్పవు

ఇంటర్ కాలేజీలు..  ర్యాంకులన్నీ మావే అంటే చర్యలు తప్పవు

ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. ఈ పరీక్షల రిజల్ట్ రావడమే ఆలస్యం.. కొన్ని కార్పొరేట్ కాలేజీలు విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించేందుకు టీవీల్లో, పేపర్లలో ఎక్కడ చూసినా వాళ్ల యాడ్స్ కనిపిస్తుంటాయి. అన్ని గ్రూప్స్ లో మా కాలేజీ టాప్, ర్యాంకులన్నీ మావే అంటూ ప్రచారం చేసుకుంటారు. అంతేకాకుండా ఒక కాలేజీలో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థి ఫొటోని అన్ని కాలేజీ పోస్టర్లలో వాడుకుంటున్నారు. దీనివల్ల పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా తప్పుదోవ పట్టే అవకాశం ఉందని, కార్పొరేట్ కాలేజీలో చదివించాలనే ఆకాంక్షతో సమాజంలో ఒక రేస్ జరుగుతుందని, అలాంటి యాడ్స్ ని ఆపించాలని చాలాకాలంగా సదరు కాలేజీలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ బీఐఈ (తెలంగాణ ఇంటర్ బోర్డు) కీలక నిర్ణయం తీసుకుంది. 

ఏ కాలేజీ అయినా ఇకపై అడ్వర్టైజ్ మెంట్ ఇవ్వాలంటే ఇంటర్ బోర్డు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. యాడ్ కంటెంట్ నియంత్రణ, ఇతర విద్యా సమస్యలపై బోర్డు ఏర్పాటు చేసిన ఎనిమిది మంది సభ్యుల కమిటీ ఈ మేకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఒక టాప్ ర్యాంకర్ ఫొటోను ఇతర కాలేజీ యాడ్స్ లో వాడినట్లయితే కంటెంట్ మోడరేషన్ కింద సంబంధిత కాలేజీపై చర్యలు తీసుకోనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రెటరీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.

అంతేకాకుండా, నిబంధనలకు విరుద్దంగా ఎక్స్ ట్రా క్లాసులు, స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల విద్యర్థుల్లో ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఈ సమస్యపై కూడా త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు నవీన్ తెలిపారు. టీచర్లకు వచ్చే ఏడాది నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు.