మెడిసిన్ లేనప్పుడు.. బయటకు రాయడంలో తప్పేంటి ? 

మెడిసిన్ లేనప్పుడు.. బయటకు రాయడంలో తప్పేంటి ? 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడిసిన్స్ లేనప్పుడు.. బయటకు రాయడంలో తప్పేంటని తెలంగాణ జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. మందులు ఉన్నా.. వైద్యులు బయటకు రాస్తేనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అందుబాటులో లేని మందులను బయటకు రాసిన ప్రభుత్వ వైద్యులపై చర్యలు తీసుకోవడాన్ని ఖండించారు. ఈనేపథ్యంలో మంగళవారం కోఠిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జూనియర్ వైద్యులు మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రులకు మెడిసిన్స్  పంపించాల్సిన బాధ్యత టీఎస్ఎంఎస్ఐడీసీపై ఉందన్నారు. డాక్టర్లు తమ స్వార్థం కోసం మందులు బయటకు రాస్తున్నారనడం తప్పని, కొన్ని సార్లు అత్యవసరం అయినప్పుడు మాత్రమే బయట మందులు కొనుక్కోమని చెబుతున్నారని పేర్కొన్నారు. అటువంటి వారికి మందులు బయటకు రాస్తే  చర్యలు తీసుకోవడమేంటి ?  ఎమర్జెన్సీ కేసుల్లో రోగి ప్రాణాల మీదకు వస్తుందన్నారు. అసలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు మెడికల్ షాప్స్ ఎందుకు పెట్టారని సూటిగా ప్రశ్నించారు. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,  వాటిని బయట కొనుక్కోవాలని వైద్యులు సిఫారసు చేస్తున్నారంటూ ఇటీవల మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈనేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఇటీవల కోఠి ఆసుపత్రిని అకస్మిక తనిఖీ చేశారు. ప్రైవేటు మెడికల్ షాపుల నుంచి మందులు తీసుకొచ్చేందుకు ఎందుకు రాస్తున్నారని ఆయన ప్రశ్నించారు.