
హైదరాబాద్, వెలుగు: పని ఒత్తిడికి జూనియర్ డాక్టర్లు బలవుతున్నరు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) నిబంధనల ప్రకారం వారానికి 48 గంటలు పనిచేయాల్సి ఉండగా, ఏకంగా 90 నుంచి 110 గంటలు వారితో పనిచేయించుకుంటున్నరు. దీంతో అనారోగ్యం బారిన పడి చనిపోతున్నరు. గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద దవాఖాన్లలో జూడాల పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉండే ఈ హాస్పిటళ్లలో పని మొత్తాన్ని ఇంటర్న్స్, సీనియర్ రెసిడెంట్లు, పీజీలపైనే మోపుతున్నరు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత విపరీతంగా ఉండటంతో ఓపీ నుంచి నైట్ డ్యూటీల వరకూ వీరికే అప్పగిస్తున్నరు. ఇంటర్నల్ మార్కులు వేసే దగ్గర్నో, మరో రకంగానే ప్రొఫెసర్లు ఇబ్బంది పెడ్తారన్న భయంతో ఎంత పని అయినా జూనియర్లు భరించాల్సి వస్తోంది. లాంగ్ వర్కింగ్ హవర్స్ తట్టుకోలేక జూడాలు అనారోగ్యం బారిన పడుతున్నరు. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో గైనకాలజీ పీజీ చేస్తున్న శ్వేత(26) పని ఒత్తిడితో మృతిచెందింది. శుక్రవారం ఉదయం 3 గంటల వరకు గైనకాలజీ వార్డులో డ్యూటీ చేసి, విశ్రాంతి కోసం రెస్ట్ రూమ్‌లోకి వెళ్లడంతో గుండెపోటుతో నిద్రలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ నాలుగైదు నెలల్లో ఇలాంటివి నాలుగు ఘటనలు జరిగాయి. గాంధీలో జనరల్ సర్జరీ విభాగంలో సీనియర్ రెసిడెంట్, నిమ్స్‌లో న్యూరాలజీ సినియర్ రెసిడెంట్ సహా మొత్తం నలుగురు జూనియర్ డాక్టర్లు గుండెపోటుతో మరణించారు. వరుస ఘటనలతో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు గురవుతున్నరు. పని గంటలను 48 గంటలకు కుదించాలని డిమాండ్ చేస్తున్నారు.