కోల్‌కతా: ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో అత్యాచారం, హత్యకు గురైన ట్రైయినీ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది జూనియర్ డాక్టర్లు మంగళవారం కోల్‌కతాలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సిటీ పోలీస్ కమిషనర్, స్టేట్ హెల్త్ సెక్రటరీ, హెల్త్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌తో పాటు హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. అప్పటిదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్టేట్ హెల్త్ సెక్టార్‌ను ‘క్లీన్’ చేసేందుకే చీపుర్లు పట్టుకుని వచ్చామని అన్నారు. సాల్ట్ లేక్‌లోని స్వాస్థ్య భవన్ ముందు జూనియర్ డాక్టర్లంతా బైఠాయించి నిరసన తెలిపారు.
దీంతో ముందుగానే పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి పెద్దసంఖ్యలో బలగాలను మోహరించారు. జూనియర్ డాక్టర్లంతా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నం. పోలీసులు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ట్రెయినీ డాక్టర్ చనిపోయింది. కోల్‌కతా సీపీతో పాటు హెల్త్ డిపార్ట్మెంట్లోని అధికారులు తమ పదవులకు రిజైన్చేయాలి. మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బుర్ర పెట్టి ఆలోచించాలి. అందుకే బ్రెయిన్ మోడల్‌తో నిరసన తెలియజేస్తున్నం’’ అని జూనియర్ డాక్టర్లు అన్నారు.
నిరసనను అణిచివేసే కుట్ర
‘శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నం. మా డిమాండ్లను స్టేట్ గవర్నమెంట్ నెరవేర్చితే.. విధుల్లో చేరే దాని గురించి ఆలోచిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నం. మా నిరసనను అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. విధుల్లో చేరే విషయమై సుప్రీం కోర్టు డెడ్‌లైన్ విధించడం సరికాదు’ అని జూనియర్ డాక్టర్లు అన్నారు.