హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. విజయవాడలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మార్చుతూ నిన్న ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించింది. ఏపీలోని వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలతోపాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా తీవ్రంగా వ్యతిరేకించారు. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్వర్ వేదికగా స్పందించి పేరు మార్చడం సరికాదంటూ తెలుగు ప్రజల హృదయాలలో చెరిపివేయలేరని పేర్కొన్నారు. 

‘‘NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం YSR స్థాయిని పెంచదు, NTR స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’’ అంటూ ట్వీట్‌ చేశారు.