పంచాయతీ సెక్రటరీల సమ్మె విరమణ

పంచాయతీ సెక్రటరీల సమ్మె విరమణ

పంచాయతీ సెక్రటరీల సమ్మె విరమణ
సోమవారం నుంచి డ్యూటీలో చేరుతం
ప్రకటించిన జేపీఎస్ ఫెడరేషన్
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన తర్వాత నిర్ణయం
రెగ్యులరైజ్​పై మంత్రి హామీ ఇచ్చారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ తో సమ్మెకు దిగిన జూనియర్ పంచాయతీ సెక్రటరీ(జేపీఎస్​)లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం రాత్రి తొర్రూరులో పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ పంచాయతీ రాజ్ సెక్రటరీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. సోమవారం నుంచి డ్యూటీలో చేరుతామని ప్రకటించారు. సమ్మె విరమిస్తే రెగ్యులరైజేషన్​పై సీఎంతో మాట్లాడతానని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. త్వరలో చర్చలకు పిలుస్తామని మంత్రి సెక్రటరీలకు చెప్పినట్లు తెలుస్తున్నది.

డ్యూటీలో జాయిన్ అవుతున్నరు

శనివారం ఉదయం నుంచి అన్ని జిల్లాల్లో సెక్రటరీలు డ్యూటీలో చేరుతున్నరు. మెదక్, సంగారెడ్డి, మహబుబాబాద్, నల్గొండ ఇలా అన్ని జిల్లాల్లో కలిపి సుమారు 3 వేల మంది జాయిన్ అయినట్లు అధికారులు చెప్తున్నారు. ఆదివారం, సోమవారం మరింత మంది చేరతారని అంటున్నారు. రెండు రోజులు సెలవులు అయినప్పటికీ డీపీవోలు సెక్రటరీలకు అందుబాటులోనే ఉన్నట్లు తెలుస్తున్నది. డ్యూటీలకు రిపోర్ట్ చేస్తున్న సెక్రటరీల వివరాలను డీపీవోలు పీఆర్ ఉన్నతాధికారులకు రిపోర్ట్​ చేస్తున్నారు. సోమవారం వరకు అందరూ జాయిన్ అవుతారని అధికారులు చెప్తున్నారు.

ఇతర జిల్లాల వారిని అడగలే

మరోవైపు సమ్మె విరమణపై ఇతర జిల్లాల సెక్రటరీలు ఫైర్ అవుతున్నారు. తమను అడగకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని వారు మండిపడుతున్నారు. మంత్రిని కలిసే విషయం కూడా తమకు చెప్పలేదంటున్నారు. యథావిధిగా సమ్మె చేస్తున్నామని, ఆదివారం సమ్మెలో భాగంగా పలు కార్యక్రమాలు చేస్తున్నామని అంటున్నారు.

ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో టెన్షన్​

గత నెల 28 నుంచి సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో సెక్రటరీల్లో ఆందోళన మొదలైంది. ఇపుడు జాబ్ ల నుంచి తొలగిస్తే నాలుగేండ్ల సర్వీస్ లాస్ అవుతామని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. 9వేల మంది సెక్రటరీలు పనిచేస్తుండగా వారి ఫ్యామిలీ పరిస్థితులు, కుటుంబ పోషణ ఇవన్ని అంశాలపై ఆలోచించి డ్యూటీలో జాయిన్ అవుతున్నారు. కొన్ని రోజులుగా అధికారులు కూడా కుటుంబసభ్యులు, భార్యలు, తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారి ద్వారా సెక్రటరీలపై ఒత్తిడి తెస్తున్నారు.

సీఎస్ ఆదేశాల అమలుకు ఏర్పాట్లు

శనివారం మధ్యాహ్నం కల్లా డ్యూటీలో జాయిన్ కావాలని, డ్యూటీలో చేరిన వారి వివరాలు, ఖాళీల వివరాలు ప్రభుత్వానికి పంపాలని శుక్రవారం అడిషనల్ కలెక్టర్లను, డీపీవోలను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. 2018లో జేపీఎస్ పరీక్ష రాసిన వారిలో మెరిట్ లిస్ట్ లో ఉన్న వారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని, వాళ్లు లేని దగ్గర డిగ్రీ పూర్తి చేసిన వారి నుంచి తీసుకోవాలని ఆమె సూచించారు. దీంతో అధికారులు ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని భావించారు. అయితే డ్యూటీలో చేరేందుకు మరో సారి గడువు ఇస్తున్నట్లు జిల్లాల్లో డీపీవోలు సెక్రటరీలకు తెలిపారు.