యాదగిరిగుట్టకు 5 కిలోల బంగారం విరాళం

యాదగిరిగుట్టకు 5 కిలోల బంగారం విరాళం
  • విమాన గోపుర స్వర్ణ తాపడానికి అందజేసిన సంస్థల అధినేత రామేశ్వరరావు
  • చినజీయర్‌‌‌‌తో కలిసి కొండపై కల్యాణ మండపం, మఠం నిర్మాణాలకు శంకుస్థాపన
  • యాదగిరిగుట్ట మిగతా క్షేత్రాలకు ఆదర్శం: చినజీయర్‌‌‌‌

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయ గర్భగుడిపై ఏర్పాటు చేసిన దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం మై హోం గ్రూప్స్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు 5 కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. సోమవారం త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి ఆయన స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం చినజీయర్ చేతుల మీదుగా బంగారాన్ని ఆలయానికి సమర్పించారు. తర్వాత కొండపైన నిర్మించే కల్యాణ మండపానికి, టెంపుల్ సిటీలో ఏర్పాటు చేసే జీయర్ మఠం నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామేశ్వరరావు మాట్లాడుతూ.. మై హోం ఇండస్ట్రీస్ నుంచి 2 కిలోల బంగారం, మై హోం కన్స్ట్రక్షన్స్ తరఫున 3 కిలోల బంగారం కలిసి మొత్తం 5 కిలోల బంగారాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించారు. బాలాలయం ప్లేస్‌‌లో నూతనంగా చేపట్టే స్వామివారి కల్యాణ మండపాన్ని సొంత ఖర్చులతో నిర్మించనున్నట్లు, ఈ అవకాశం లభించడం తనకు అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు. విమాన గోపురంపై ఏర్పాటు చేసే బంగారు తాపడానికి బంగారం విరాళం ఇవ్వడం ద్వారా ఆలయ పునర్నిర్మాణంలో భాగం అవుతుండడం సంతోషంగా ఉందన్నారు.
 
గర్భగుడిలో ప్రత్యేక పూజలు..

అంతకుముందు గర్భగుడిలో స్వయం భూ నారసింహుడికి చినజియర్ స్వామి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. మొదట ఉత్తర రాజగోపురం నుంచి ఆలయ మాడవీధుల్లోకి చేరుకున్న చినజీయర్.. తూర్పున ఉన్న త్రితల రాజగోపురం మీదుగా ఆలయంలోకి చేరుకున్నారు. ఆంజనేయస్వామి, ఉప ఆలయాల్లోని దేవతా మూర్తులను దర్శించుకొని, నేరుగా ప్రధానాలయ గర్భగుడిలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పశ్చిమ రాజగోపురం నుంచి ఆలయం బయటకు వచ్చి మాడవీధుల్లో నిర్మించిన అద్దాల మండపం, శిల్పాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

కల్యాణ మండపం, మఠంకు శంకుస్థాపన..

యాదగిరి కొండపై బాలాలయం స్థలంలో కొత్తగా నిర్మించే కల్యాణ మండపానికి, టెంపుల్‌‌ సిటీపై నిర్మించే మఠం కోసం చినజీయర్ స్వామి శంకుస్థాపన చేశారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చినజియర్‌‌‌‌ స్వామికి మఠం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలం కేటాయించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మిగతా క్షేత్రాలకు ఆదర్శమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి యాదగిరి నరసింహుడు పెద్ద రక్షకుడు లాంటి వారన్నారు. దానికి తగ్గట్టుగా క్షేత్రం కూడా ఏర్పడిందని, స్వామి వారికి కూడా అదే స్థాయిలో నిత్య కైంకర్యాలు జరిగి అందరికీ శుభం జరగాలని ఆకాంక్షించారు. యాదగిరిగుట్ట నరసింహస్వామి కరుణా కటాక్షాలతోనే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయని, పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారని తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని అధ్యాత్మికత ఉట్టిపడేలా కృష్ణశిలతో ఆలయాన్ని పునర్నిర్మించిన సీఎం కేసీఆర్‌‌‌‌కు మంగళ శాసనాలు అందజేస్తున్నామన్నారు.