సీఎంఆర్ కుంభకోణంపై చర్యలేవి?

సీఎంఆర్ కుంభకోణంపై  చర్యలేవి?
  • ఆర్ఆర్ యాక్ట్ ద్వారా ఎందుకు రికవరీ చేయలేదు 
  • రివ్యూ మీటింగ్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్

గద్వాల, వెలుగు: కోట్ల రూపాయల సీఎంఆర్  కుంభ కోణంపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆఫీసర్లపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీరియస్ అయ్యారు. మంగళవారం మొదటిసారిగా జిల్లాకు వచ్చిన మంత్రికి జడ్పీ చైర్​ పర్సన్​ ఘన స్వాగతం పలికారు. అనంతరం  కలెక్టరేట్​ మీటింగ్ హాల్ లో  అన్ని శాఖలపై  మంత్రి జూపల్లి రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా రెండేళ్ల  నుంచి  సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సివిల్ సప్లై ఆఫీసర్లను ప్రశ్నించారు. ఆర్ఆర్ యాక్ట్ ద్వారా వారి ఆస్తులను జప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిపై సీరియస్ గా ఉందని, జిల్లాలో ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని నిర్మూలించాలన్నారు. జిల్లాలో ఎన్ని కల్లు సొసైటీలు ఉన్నాయని, ఎన్నింటిని రద్దు చేశారని, ఎంతమంది కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారని ఎక్సైజ్ ఆఫీసర్లను ప్రశ్నించారు. కల్తీ కల్లు అమ్మితే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు.

అవినీతికి తావులేకుండా పారదర్శకంగా అధికారులు పనిచేయాలని సూచించారు.  పెండింగ్ లో  ఉన్న ధరణి అప్లికేషన్లను పూర్తిచేయాలన్నారు.  ధాన్యం సేక రణపై ఆరా తీశారు. జూరాల, నెట్టెంపాడు, ర్యాలంపాడు, ఆర్డీఎస్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టుల పనులు ఎంతవరకు పూర్తయ్యాయో నివేదిక అందజేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. టూరిజం, మున్సిపల్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్  శాఖలపై ఆరా తీశారు.  

జూరాల లో 75శాతం టూరిజం పనులు పూర్తయ్యాయని,   అలంపూర్  జోగుళాంబ ఆలయంలో ప్రసాద్ పథకం పనులు 70 శాతం పూర్తయినట్టు టూరిజం శాఖ అధికారులు తెలిపారు.  గద్వాల, అలంపూర్ లలోని 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు 90శాతం పూర్తయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. సమావేశంలో జడ్పీ చైర్మెన్ సరిత, కలెక్టర్   క్రాంతి, ఎమ్మెల్సీ  వెంకట్రామ్ రెడ్డి , ఎమెల్యేలు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, విజయుడు, అడిషనల్ కలెక్టర్లు అపుర్వ్ చౌహాన్, శ్రీనివాస్,  అధికారులు   పాల్గొన్నారు. 

మంత్రి జూపల్లికి  స్వాగతం పలికిన కలెక్టర్

వనపర్తి, వెలుగు: రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక శాఖ  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంగళవారం  తొలిసారిగా వనపర్తి జిల్లాకు జూపల్లి కృష్ణారావు వచ్చారు. కలెక్టరేట్​ వద్ద కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్, అడిషనల్ కలెక్టర్  తిరుపతి రావు, ప్రజాప్రతినిధులు మంత్రికి బొకే ఇచ్చి స్వాగతం పలికారు. గద్వాల పర్యటన ముగించుకొని తిరిగి వెళుతూ మంత్రి జూపల్లి వనపర్తిలో అధికారులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వనపర్తిలోని తిరుమల హిల్స్ లో ఉన్న  ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని మంత్రి జూపల్లి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.