ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల నెరవేర్చుకోవాలి : మంత్రి జూపల్లి

ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల నెరవేర్చుకోవాలి : మంత్రి జూపల్లి

కొల్లాపూర్, వెలుగు : పేదలు ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల నెరవేర్చుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  బుధవారం కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు గొప్పలకు పోయి భారీగా అప్పులు చేసి తిప్పలు పడవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన 60 గజాల పరిధిలో ఇల్లు నిర్మించుకుని సంతోషంగా ఉండాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా రూ. 22 వేల కోట్లతో 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేశామని, త్వరలోనే రెండో విడత ఇళ్లకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. అనంతరం కొల్లాపూర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ భరత్ కుమార్, మున్సిపల్ చైర్‌‌‌‌ పర్సన్ రెడ్డి జ్యోతి, కౌన్సిలర్లు, ఇతర అధికారులు 
పాల్గొన్నారు.