తుమ్మల, పొంగులేటితో జూపల్లి భేటీ..రాజకీయ వర్గాల్లో హీట్

తుమ్మల, పొంగులేటితో జూపల్లి భేటీ..రాజకీయ వర్గాల్లో హీట్
  • ఖమ్మం జిల్లా నేతలతో వేరు వేరుగా సమాలోచనలు
  • 15 తర్వాత రాజకీయ పరిణామాల్లో మార్పు
  • సీఎం వనపర్తి టూర్ కు జూపల్లికి అందని ఆహ్వానం
  • రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, ఖమ్మం, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో వేర్వేరుగా భేటీ అయ్యారు. వనపర్తిలో సీఎం కేసీఆర్​ మీటింగ్ ఉన్న టైమ్​లో జూపల్లి అక్కడ ఉండకుండా, ఖమ్మం జిల్లాకు వెళ్లి తుమ్మల, పొంగులేటితో సమాలోచనలు జరపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పర్యటనకు జూపల్లిని ఆహ్వానించలేదు. సొంత జిల్లాకు సీఎం వచ్చినప్పుడు మాజీ మంత్రిగా పనిచేసిన తనను ఆహ్వానించకపోవడంతో మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఖమ్మం జిల్లాకు వెళ్లి అక్కడ తుమ్మల, పొంగులేటితో భేటీ అయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లి కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌ నుంచి, తుమ్మల పాలేరు నుంచి టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్లుగా పోటీ చేసి గెలిచిన బీరం హర్షవర్ధన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, కందాల ఉపేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆ తర్వాత టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. అప్పటి నుంచి రెండు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతోంది.
నేతలకు తగ్గిన ప్రాధాన్యం
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌‌ఎస్‌‌ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపడితే జూపల్లికి నియోజకవర్గంలో కనీసం సభ్యత్వం ఇవ్వలేదు. తర్వాత ఆయన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకపోతే ఫార్వర్డ్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌ నుంచి పోటీ చేయించి మెజార్టీ వార్డుల్లో గెలుపొందారు. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు సీట్లు తక్కువ వచ్చినా ఎక్స్‌‌‌‌‌‌‌‌ అఫీషియో ఓట్లతో మున్సిపల్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పీఠాన్ని దక్కించుకుంది. పాలేరులోనూ తుమ్మల అనుచరులకు టికెట్లు ఇవ్వలేదు. కొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీకి దిగినా హైకమాండ్ వారించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కూడా నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. సిట్టింగ్‌‌‌‌‌‌‌‌ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని కాదని టీడీపీ నుంచి వచ్చిన నామా నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావుకు  ఎంపీ టికెట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌‌‌‌‌‌‌‌ ఓటింగ్‌‌‌‌‌‌‌‌కు పొంగులేటి కారణమని ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలంతా కేసీఆర్‌‌‌‌‌‌‌‌, కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు చేశారు.  
అవమానాలు, ప్రత్యామ్నాయాలపై చర్చ!
సీఎం వనపర్తి జిల్లాకు వెళ్లిన సమయంలోనే టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో అసంతృప్త నేతలుగా ఉన్న తుమ్మల, పొంగులేటిని మాజీ మంత్రి జూపల్లి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో పార్టీలో ఎదురవుతున్న అవమానాలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇతర అంశాలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పొంగులేటిని జూపల్లి కలిసిన సమయంలో సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన పిడమర్తి రవి అక్కడే ఉన్నారు. పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నట్టుగా భావిస్తున్న నేతలంతా ఏకతాటిపైకి వచ్చి రాజకీయ కార్యాచరణ ప్రకటించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 15 తర్వాత రాజకీయాల్లో భారీ పరిణామాలు జరిగే అవకాశం ఉందని టీఆర్​ఎస్ ఖమ్మం నేతలు అంటున్నారు.