- ప్యాకేజీ 22 ద్వారా రెండో వంతు భూ సేకరణ కూడా చేయలేదు
- పనులు చేయకున్నా కాంట్రాక్టర్లకు పైసలు ముట్టినయ్
- నన్ను కుటుంబం నుంచి పంపి శునకానందం పొందుతుండ్రు
- కుట్ర చేసి నన్ను కేసీఆర్కు దూరం చేసిండ్రు
- బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ద్రోహులే
- ఇంత అర్జెంట్ గా పంచాయతీ ఎన్నికల అవసరమేముంది?
కామారెడ్డి: కాళేశ్వరం ప్రాజెక్టుతో కామారెడ్డి ప్రాంతంలోని ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇవాళ ఆమె కామారెడ్డిలో మీడియాతో మాట్లాడారు.. కామారెడ్డి జిల్లాకు ఉద్దేశించిన ప్యాకేజీ 21, 22 ద్వారా కాంట్రాక్టర్లకు డబ్బులు వచ్చాయి కానీ, ప్రజలకు మేలు జరగలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్యాకేజ్ 22 ద్వారా కామారెడ్డికి నీళ్లు ఇచ్చేందుకు ప్లాన్ చేశారని ఇందుకు రూ. 1446 కోట్లు అవసరమైతే రూ. 450 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. దీంతో కామారెడ్డి ప్రాంతానికి నీళ్లు వస్తాయా? అని ప్రశ్నించారు.
మొత్తం 1500 ఎకరాల ల్యాండ్ అవసరమైతే రెండో వంతు భూసేకరణ కూడా చేయలేదన్నారు. కొండం చెరువు కెపాసిటీ ని తగ్గించారని, ప్రాజెక్ట్ వ్యయం మాత్రం తగ్గించలేదని అన్నారు. కాళేశ్వరం 21, 22 ప్యాకేజ్ ల కారణంగా ప్రజలకు మేలు జరగలేదని, కాంట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు ముట్టాయన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులు ఈ ప్రభుత్వం కొనసాగించాలన్నారు. కాళేశ్వరం పనులు కొనసాగించకపోతే కామారెడ్డికి వేరే ఏ మార్గంలో నీళ్లు తెస్తారో ప్రభుత్వం చెప్పాలని అన్నారు.
కుట్రలతో కుటుంబం నుంచి దూరం చేసిండ్రు
తనను కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో చాలా బాధపడ్డానని, తనను కుటుంబం నుంచి పంపించిన వారు శునకానందం పొందారని అన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు తన పిల్లల కన్నా కూడా మా అమ్మ ఆరోగ్యం గురించే ఎక్కువ బాధపడ్డానని కవిత అన్నారు. తెలంగాణ అనే మరో కుటుంబం తనకు ఉందని, వారి కోసం ధైర్యంగా పనిచేస్తానని అన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్, బీజేపీని నిలదీస్తూనే ఉంటం
ఇక కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉందని, ఇక్కడ నుంచే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. రేవంత్ రెడ్డి బీసీ ద్రోహి అని ఇప్పటికే ప్రకటించామని, బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్ అని తెలిపారు. ఆ రెండు పార్టీలను తాము నిలదీస్తూనే ఉంటామని అన్నారు.
ఇంత అర్జెంట్ గా పంచాయతీ ఎన్నికల అవసరమేముందని కవిత ప్రశ్నించారు. దేశంలో ఏ మార్పు రావాలన్న రాజకీయాల ద్వారానే సాధ్యమని, సర్పంచ్ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే పార్టీలను యువత ప్రశ్నించాలని అన్నారు. వారు ఏం చేస్తారో మాట తీసుకోవాలని, గెలిచాక చేయకపోతే తాట తీయాలని పిలుపునిచ్చారు.
