డేంజర్ లో జూరాల ప్రాజెక్టు కాలువలు..పదేండ్లుగా లేని మెయింటెనెన్స్

డేంజర్ లో జూరాల ప్రాజెక్టు కాలువలు..పదేండ్లుగా లేని మెయింటెనెన్స్

పదేండ్లుగా మెయింటెనెన్స్​ లేక బలహీనంగా మారిన కాలువలు

  •     ఎస్టిమేట్స్​ పంపినా ఫండ్స్​ రిలీజ్​ చేయని సర్కారు
  •     పెబ్బేరు వద్ద గండికి తాత్కాలిక మరమ్మతులు
  •     మరికొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే ఉందని రైతుల్లో ఆందోళన

పెబ్బేరు, వెలుగు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్​ ప్రధాన కాలువ బలహీనంగా తయారై ప్రమాదపుటంచులకు చేరుతోంది. నిధుల కొరతతో ఏండ్లుగా రిపేర్లు చేయకపోవడంతో ఎప్పుడు ఎక్కడ గండి పడుతుందోనని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కర్ణాటకలోని నారాయణఫూర్  గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతుండటంతో వనపర్తి, గద్వాల జిల్లాల సరిహద్దులోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది.

దీంతో కుడి, ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. కాలువల నిండా నీరు ప్రవహిస్తుండగా, అక్కడక్కడ ఉన్న గండ్లు బయట పడుతున్నాయి. మంగళవారం పెబ్బేరు వద్ద ఏర్పడ్డ గండిని ఆఫీసర్లు తాత్కాలికంగా మట్టితో పూడ్చారు. 

ఏండ్లుగా పట్టించుకుంటలే..

జూరాల కెనాల్స్​కు పదేండ్లుగా రిపేర్లు చేయలేదు. ప్రతి ఏటా కెనాల్స్​ను పరిశీలించి మరమ్మతులు చేయాల్సి ఉన్నా, గవర్నమెంట్​నుంచి అవసరమైన ఫండ్స్​ రిలీజ్​ కాకపోవడంతో సంబంధిత ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. ఇక పెబ్బేరు సమీపంలోని అత్యవసర గేట్​ వద్ద గండి పడగా, కెనాల్​లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మరికొన్ని చోట్ల గండ్లు పడే అవకాశం ఉందని అక్కడి రైతులు సంబంధిత ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు.

పెబ్బేరు నుంచి గోవర్ధనగిరి వరకు 4 చోట్ల కెనాల్​ బలహీనంగా మారిందని, గండ్లు పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాలువల లైనింగ్ లు దెబ్బతిన్నాయని, కంప చెట్లు మొలిచి,  కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి పంట పొలాల్లోకి వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే కెనాల్​ బలహీనంగా మారిందని, గవర్నమెంట్​కు ఎస్టిమేట్స్ పంపినా ఫండ్స్  రావడం లేదని ఇరిగేషన్  ఆఫీసర్లు వాపోతున్నారు. 

గండికి మట్టితో రిపేర్లు..

వనపర్తి జిల్లాలోని పెబ్బేరు మీదుగా వెళ్తున్న జూరాల లెఫ్ట్​ మెయిన్​ కెనాల్​కు మంగళవారం సాయంత్రం గండి పడింది. 40 కి.మీ వద్ద అత్యవసర గేట్ కు రిపేర్లు చేసి చాలా రోజులైంది. దీంతో గేట్ పైకి ఎక్కే మెట్లు కూలి కాలువ లైనింగ్  మీద పడడంతో అక్కడ గండి పడింది. నీళ్లన్నీ అవతలి వైపు ఉన్న  పంట పొలాల్లోకి వెళ్లడంతో రైతులు ఆందోళన చెందారు. వెంటనే స్పందించిన ఇరిగేషన్​ ఆఫీసర్లు రామన్​ పాడ్​ ప్రాజెక్టు గేట్లను క్లోజ్​ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

మంగళవారం రాత్రి వరకు మట్టి కొట్టించి లెవల్​ చేశారు. వర్షం తగ్గితే కాంక్రీట్​ పనులు పూర్తి చేస్తామని ఇరిగేషన్​ డీఈ భావన, ఏఈలు మతీన్, ప్రభు తెలిపారు. ఇదిలాఉంటే ఆఫీసర్లు సకాలంలో స్పందించకపోతే కాలువ కట్ట పూర్తిగా తెగిపోయి ఉండేదని రైతులు అంటున్నారు.  

వెంటనే రిపేర్లు చేయాలి..

జురాల కాలువకు చాలా చోట్ల రిపేర్లు చేయాలి. ఇప్పుడు గేట్​ వద్ద పడిన గండిని వెంటనే గుర్తించి రిపేర్​ చేయడంతో ప్రమాదం తప్పింది. ఇటాంటివి ముందే గుర్తించి రిపేర్లు చేయించాలి.

- అనిల్​కుమార్​ రెడ్డి, రైతు, పెబ్బేరు