పేద దేశాల్లో జనాలు చస్తున్నా పట్టించుకోరా?

పేద దేశాల్లో జనాలు చస్తున్నా పట్టించుకోరా?

జెనీవా: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ధనిక దేశాలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియోసస్ మండిపడ్డారు. ధనిక దేశాలు కరోనాతో పెద్దగా రిస్క్ లేని యువతకు టీకా ఇస్తున్నాయని, కానీ పేద దేశాల్లో ఇన్ఫెక్షన్ ముప్పు ఉన్న వారికి వ్యాక్సిన్ అందట్లేదని అధనోమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్రికన్ దేశాల్లో పరిస్థితి చాలా విషమంగా ఉందని, గత వారం కంటే మరణాల రేటు 40 శాతం పెరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ భయాందోళనలు కలిగిస్తోందన్నారు. 

‘మన ప్రపంచం విఫలమవుతోంది. ఓ సమూహంగా మనందరం ఫెయిల్ అవుతున్నాం. పేద దేశాలకు టీకాలు అందడం లేదు. ఇప్పుడు పంపిణీ ఓ పెద్ద సమస్యగా పరిణమించింది. దయచేసి మాకు వ్యాక్సిన్‌లు ఇవ్వండి. ఉన్నోళ్లకు, లేనోళ్లకు మధ్య తేడా ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలను బహిర్గతం చేస్తోంది. రండి.. అన్యాయం, అసమానతలను ఎదుర్కొందాం’ అని అధనోమ్ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాలు పితృస్వామ్యాన్ని, వలసవాద ఆలోచనా విధానాన్ని వదలాలని డబ్ల్యూహెచ్‌వో టాప్ ఎమర్జెన్సీ ఎక్స్‌పర్ట్ మైక్ ర్యాన్ సూచించారు.