రోడ్డు భద్రతలో GHMC చర్యలు భేష్: జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే

రోడ్డు భద్రతలో GHMC చర్యలు భేష్: జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే

హైదరాబాద్ సిటీ, వెలుగు: రోడ్డు భద్రత, నిర్వహణను మెరుగుపరచడంలో జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలు బాగున్నాయని రోడ్ సేఫ్టీ కమిటీ చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే ప్రశంసించారు. గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్​తో కలిసి జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌ రోడ్డు నంబర్ 45 ఫ్లైఓవర్, కొండాపూర్ నుంచి   గచ్చిబౌలి వెళ్లే పి జనార్ధన్ రెడ్డి ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌ పైన ప్రమాదాలు జరగకుండా జీహెచ్ఎంసీ తీసుకున్న భద్రత చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

హెచ్చరిక సైన్ బోర్డులు, రేడియం స్టిక్కర్లు, సీసీ కెమెరాలు, వేగాన్ని నియంత్రించడానికి రంబుల్ స్ట్రిప్‌‌‌‌‌‌‌‌లు, చెవ్రాన్ బోర్డులు, కాంక్రీట్ అడ్డంకులు, రాత్రిపూట లైటింగ్ కోసం వీధి లైట్ల ఏర్పాట్లు సహా అనేక భద్రతా చర్యలను ఆయన సమీక్షించారు.  రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జీహెచ్ఎంసీ తీసుకున్న భద్రత చర్యల పట్ల  జస్టిస్ సప్రే సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే మాట్లాడుతూ..  ప్రజల జీవితం విలువైందని,  నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు కోల్పోకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజినీర్ భాస్కర్ రెడ్డి, మెయింటెనెన్స్ చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.