హైకోర్టు సీజేగా జస్టిస్ శర్మ?

హైకోర్టు సీజేగా జస్టిస్ శర్మ?
  • సుప్రీం కొలీజియం సిఫార్సు.. ఏపీ హైకోర్టు సీజేగా పీకే మిశ్రా
  • 8 హైకోర్టులకు కొత్త సీజేలు
  • 28 మంది జడ్జిల బదిలీకి సిఫార్సు
  • త్వరలో ఆమోదించనున్న కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్ లు రానున్నారు. కర్ణాటక హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్​చంద్ర శర్మను తెలంగాణ హైకోర్టు సీజేగా, ఛత్తీస్ గఢ్ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను ఏపీ హైకోర్టు సీజేగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా 8 హైకోర్టులకు కొత్త సీజేలను కేంద్రానికి సిఫార్సు చేసింది. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ లతో కూడిన కొలీజియం గురు, శుక్రవారాల్లో సుదీర్ఘంగా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మొత్తం ఐదుగురు సీజేలతో పాటు మరో 28 మంది జడ్జిల బదిలీకి సిఫార్సు చేసినట్టు సమాచారం. అలహాబాద్ హైకోర్టు సీజేగా జస్టిస్ రాజేశ్ బిందల్, కోల్ కతా హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, కర్ణాటక హైకోర్టు సీజేగా జస్టిస్ రుతురాజ్ అవస్థి, మేఘాలయ హైకోర్టు సీజేగా జస్టిస్ రంజిత్ వి.మోరే, గుజరాత్ హైకోర్టు సీజేగా జస్టిస్ అరవింద్ కుమార్, మధ్య ప్రదేశ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆర్.వి.మలిమత్ పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఛత్తీస్ గఢ్​కు, మధ్యప్రదేశ్ సీజే జస్టిస్ మహ్మద్ రఫిక్ ను హిమాచల్​కు, త్రిపుర సీజే జస్టిస్ అఖిల్ ఖురేషీని రాజస్థాన్​కు, రాజస్థాన్ సీజే జస్టిస్ ఇంద్రజిత్ మహంతిని త్రిపురకు, మేఘాలయ సీజే జస్టిస్ బిశ్వనాథ్ సోమదర్ ను సిక్కింకు సిఫార్సు చేసింది. వాటికి కేంద్రం ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపనున్నట్టు సమాచారం. 

పోస్టులు 1,080... ఉన్నది 420 మంది
దేశవ్యాప్తంగా 25 హైకోర్టుల్లో మొత్తం 1, 080 జడ్జి పోస్టులుండగా ప్రస్తుతం 420 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. భారీగా ఉన్న ఈ ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయడమే లక్ష్యమని ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశంలో సీజేఐ ప్రకటించారు. నెల రోజుల్లోగా వాటిలో 90 శాతం భర్తీ చేయగలమని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘గత ఏప్రిల్లో నేను సీజేఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు హైకోర్టులకు జడ్జిలుగా దాదాపు 82 పేర్లను సిఫార్సు చేశాం. వాటిని కేంద్రం త్వరగా ఆమోదిస్తుందని ఆశిస్తున్నాం”అని చెప్పారు. ఇటీవల 12 హైకోర్టులకు ఏకంగా 68 మందిని జడ్జిలుగా కొలీజియం సిఫార్సు చేసింది.