- 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
- రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సమక్షంలోప్రమాణ స్వీకారం
- హాజరైన ఉప రాష్ట్రపతి, ప్రధాని, సీఎం రేవంత్
- తొలిసారి వివిధ దేశాల చీఫ్ జస్టిస్‌లు అటెండ్
- 15 నెలల పాటు పదవిలో కొనసాగనున్న సూర్యకాంత్
- హర్యానా నుంచి తొలి సీజేఐగా రికార్డు
న్యూఢిల్లీ, వెలుగు: సుప్రీంకోర్టు 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ బీఆర్ గవాయ్ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా ఆయన రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ప్రోగ్రామ్‌కు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తొలిసారిగా భూటాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్‌లు వారి కుటుంబ సభ్యులతో అటెండ్ అయ్యారు.
20 ఏండ్లుగా వివిధ ధర్మాసనాల్లో బాధ్యతలు
జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 1985లో పంజాబ్, హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
అధికారిక వాహనం వదిలి వెళ్లిన మాజీ సీజేఐ
మాజీ సీజేఐ బీర్ గవాయ్ అధికారిక మెర్సిడెస్ బెంజ్ కారును రాష్ట్రపతి భవన్‌లోనే వదిలి వెళ్లారు. జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీజేఐ హోదాలో బీఆర్ గవాయ్ అధికారిక బెంజ్ కారులో రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశాక.. కంగ్రాట్స్ చెప్పి తన వ్యక్తిగత వాహనంలో తన నివాసానికి వెళ్లిపోయారు.
సీజేఐకు ఆల్ ది బెస్ట్: ప్రధాని మోదీ
సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కు బెస్ట్ విషెస్’ అని పోస్ట్ చేశారు. కాగా, జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలో రాజ్యాంగ విలువలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నట్లు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.
పదవి కాలం ప్రేరణాత్మకంగా సాగాలి: సీఎం రేవంత్ రెడ్డి
కొత్త సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పదవీ కాలం ప్రేరణాత్మకంగా కొనసాగాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. సోమవారం ఉదయమే ఢిల్లీ చేరుకున్న రేవంత్.. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. జస్టిస్ సూర్యకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ విలువలు మరింత బలపర్చేలా ఆయన ప్రయాణం కొనసాగాలని తెలిపారు.
