పెట్టుబడుల పేరిట రూ.కోట్లలో మోసం .. పోలీసులను ఆశ్రయించిన బాధితులు  

పెట్టుబడుల పేరిట రూ.కోట్లలో మోసం .. పోలీసులను ఆశ్రయించిన బాధితులు  
  • బోర్డు తిప్పేసిన జేవీ బిల్డర్స్‌ ఎండీ దంపతులు

ఉప్పల్, వెలుగు :  రియల్ ఎస్టేట్​లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని, ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశచూపిన దంపతులు సామాన్య ప్రజల నుంచి రూ. కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. ఉప్పల్ పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..జేవీ బిల్డర్స్‌ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారి వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు ఉప్పల్ నల్లచెరువు వద్ద ఓ దవాఖాన వెనకాల ఉన్న విమల నివాస్ భవనంలోని రెండో అంతస్తులో ఆఫీసు పెట్టారు. తమ దగ్గర పెట్టుబడి పెడితే..   నెల నెలా అధిక వడ్డీలు ఇస్తామని నమ్మించారు.

వేలాది మంది దగ్గర రూ. కోట్లు వసూలు చేశారు. కొన్ని నెలలు వారు చెప్పినట్టుగానే వడ్డీ డబ్బులు చెల్లించారు. నమ్మకం కలగడంతో వారు తమ బంధువులు, స్నేహితులతో పెట్టుబడులు పెట్టించారు. ఇలా రూ. కోట్లు రావడంతో లక్ష్మీనారాయణ దంపతులు ఆఫీసు బోర్డు తిప్పేశారు. కొద్ది రోజులుగా ఆఫీసుకు తాళం వేసి కనిపించకుండా పోయారు.  ఫోన్లు చేసినా సమాధానం లేదు. దీంతో తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కోట్లలో ఇన్వెస్ట్​ చేసిన 500 మంది ఏజెంట్లు

పెట్టుబడికి నెల నెలా 10 శాతం వడ్డీ ఇస్తామని, పెట్టుబడులు పెట్టిస్తే మరో 4 శాతం వడ్డీ ఇస్తామంటూ వినయ్ అనే వ్యక్తిని లక్ష్మీనారాయణ దంపతులు నమ్మించారు. దీంతో అతడు రూ. 18 లక్షలు పెట్టుబడి పెట్టి అదే కంపెనీలో ఏజెంట్ గా చేరాడు. మరికొందరితో రూ.2 కోట్ల 50 లక్షల పెట్టుబడులు పెట్టించాడు. ఇలా ఇంకో 500 మంది రూ. కోట్లలో ఇన్వెస్ట్ చేసి ఏజెంట్లుగా చేరారు. ఇప్పటికే లక్ష్మీనారాయణపై పలు పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదు అయ్యాయి.  మేడిపల్లిలో ఉండే ఆఫీసును ఏడాది కిందట ఉప్పల్ కు మార్చాడని బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఉప్పల్ పోలీసులు తెలిపారు.