- హనుమకొండలో బిచ్చగాళ్లతో
- జ్వాలా స్వచ్ఛంద సేవా సంస్థ ర్యాలీ
హనుమకొండ, వెలుగు: ‘లంచగొండి ఆఫీసర్ల కంటే బిచ్చగాళ్లే నయం. అవినీతి కన్నా.. అడుక్కు తినడం మిన్న’ అని లోక్ సత్తా ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు బండారు రామ్మోహనరావు, జ్వాలా అవినీతి వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సుంకరి ప్రశాంత్ తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలో మంగళవారం జ్వాలా అవినీతి వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ, లోక్ సత్తా ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. అవినీతి ఆఫీసర్ల కంటే నిజాయతీగా అడుక్కునే బిచ్చగాళ్లే నయం అంటూ హనుమకొండలోని వేయి స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. బిచ్చగాళ్ల చేతికి ప్లకార్డులు ఇచ్చి, అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి సర్వసాధారణమైందని ఆందోళన వ్యక్తం చేశారు. లంచగొండి అధికారులను ఏసీబీ పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా.. వారిపై చర్యలు మాత్రం ఉండడం లేదన్నారు. ప్రజల సొమ్ముతో జీతాలు, పింఛన్లు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించాలని కోరారు. ఏసీబీకి పట్టుబడిన ఆఫీసర్లకు మళ్లీ పోస్టింగ్లు ఇస్తున్నారని, మళ్లీ ఉద్యోగం ఇవ్వకుండా నిబంధనలు కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ వీవీ రావు, లోక్ సత్తా, జ్వాలా ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి, అచ్చ అమర్నాథ్, బుర్రి కృష్ణమూర్తి, ప్రకాశ్, గుండపు సాయిచంద్, ఎల్బీ కాలేజీ ఎన్సీసీ స్టూడెంట్లు పాల్గొన్నారు.

