
- ఫాం హౌస్ లో కేసీఆర్, కేటీఆర్ సమావేశం
- బీఆర్ఎస్ గ్రూపుల నుంచి కవిత పీఏ, పీఆర్వోల తొలగింపు
హైదరాబాద్, వెలుగు: ఓ వైపు సీబీఐ విచారణ.. మరోవైపు కవిత మాటల తూటాలతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణను సీబీఐకి అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన ఈ నేపథ్యంలోనే తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై గులాబీ పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎర్రవల్లి ఫాం హౌస్ కు వెళ్లి కేసీఆర్ తో సమావేశమయ్యారు. అసెంబ్లీలో జరిగిన విషయాలను వివరించారు. ఇప్పటికే కమిషన్ రిపోర్ట్ కొట్టేసేది లేదని హై కోర్టు చెప్పడం.. సీబీఐని పిలిపించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తుండడంతో బీఆర్ఎస్ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. సుప్రీంకోర్టుకు వెళ్లాలా? ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అన్న దానిపై లీగల్ టీమ్స్ తో పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే విషయమూ ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.
కవిత వ్యాఖ్యల కలకలం
సీబీఐ ఎంక్వయిరీతో బీఆర్ఎస్పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందని అనుకునేలోపే.. కవిత సంచలన వ్యాఖ్యలతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయింది. హరీశ్ రావు, సంతోష్ లే కేసీఆర్ దుస్థితికి కారణమంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపారు. ఈ అంశంపైనా కేసీఆర్, కేటీఆర్ చర్చించుకున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ఇలాగే వదిలేస్తే మరింత ముదిరి పార్టీకి నష్టం తప్పదని, దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉందని కేసీఆర్ దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు హరీశ్ రావు తన కూతురు డిగ్రీ జాయినింగ్ కోసం బ్రిటన్ వెళ్లారు. తిరిగి వచ్చాక ఎలా స్పందిస్తారో చూడాలని అంటున్నారు. ప్రస్తుతానికైతే పార్టీ పెద్దలు దీనిపై బహిరంగంగా స్పందించకపోయినా.. కవితపై ఏదో ఒక చర్య తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారిక గ్రూపుల నుంచి కవిత పీఏ, పీఆర్వోలను తొలగించారు. కాగా, కేసీఆర్ ను సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తదితరులు కలిశారు.