లొంగిపోయిన మావోయిస్టులకు.. ఉపాధి చూపడంలో ప్రభుత్వం ఫెయిల్ : జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌ నారాయణ

లొంగిపోయిన మావోయిస్టులకు.. ఉపాధి చూపడంలో ప్రభుత్వం ఫెయిల్ : జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌ నారాయణ
  •     సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌ నారాయణ
  •     లొంగిపోయినవారు అధైర్యపడొద్దు.. అండగా ఉంటామని హామీ
  •     పాలన బాగుంటేనే నక్సలిజం అంతమవుతుందని కామెంట్​ 

హైదరాబాద్, వెలుగు: మావోయిస్టు రహిత దేశంగా భారత్ మారిందని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌​నారాయణ మండిపడ్డారు. దేశంలో నక్సలిజం అంతమైందని అమిత్ షా ప్రకటించారని, లొంగిపోయిన మాజీ మావోయిస్టుల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు వీడియో ద్వారా సందేశాన్ని పంపించారు. అడవి నుంచి వచ్చిన మావోయిస్టులకు ఉపాధి కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 

దశాబ్దాల కాలం ప్రజా సమస్యలపై పోరాడినవారు.. ప్రస్తుతం సమాజంలో కనీస గౌరవం లేక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. నిరంతరం నిఘా నీడలో, పోలీసుల వేధింపుల మధ్య వారు బతుకుతున్నారని తెలిపారు. దాదాపు 40 ఏండ్లపాటు ఉద్యమంలో పనిచేసిన ఒక సీనియర్ నేత, లొంగిపోయిన తర్వాత ఎదురైన అవమానాలను భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు చెప్పారని వాపోయారు. ఇలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి వారికి పునరావాసం, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. 

ప్రభుత్వాల పనితీరులో మార్పు రానంత కాలం ఏదో రూపంలో ప్రజా వ్యతిరేకత కొనసాగుతూనే ఉంటుందన్నారు. పాలన బాగుంటేనే నక్సలిజం వంటి ఉద్యమాలు శాశ్వతంగా అంతమవుతాయని స్పష్టం చేశారు. కేవలం ఎన్​కౌంటర్లు, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు ఎవరూ అధైర్యపడొద్దని, తమ పార్టీ సిద్ధాంతపరంగా, సామాజిక పరంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తమ పార్టీని సంప్రదించాలని, సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.