
తనపై నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. తనను తట్టుకోలేక తనపై ఉన్న పాత కేసులను తిరగదోడుతున్నారని ఆరోపించారు. కామారెడ్డి రైతులకు న్యాయం చేశానన్న కేఏ పాల్.. కేసీఆర్ భయపడి తనను అరెస్టు చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి పాత కేసులో తనను అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ కల్లా కేసీఆర్ ప్రగతిభవన్ ఖాళీ చేస్తారని జోస్యం చెప్పారు. కనీసం కుక్కల నుంచి కూడా ప్రజలను కాపాడలేకపోతున్నారంటూ సెటైర్ వేశారు. ఒక కామారెడ్డి కాదు తెలంగాణ రైతుల పక్షాన తాను నిలబడుతానని చెప్పారు. తాను ఐదు లక్షల కోట్లు దానం చేశానని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారంటూ ఆరోపించారు. అప్పు చేసిన ఐదు లక్షల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ లో ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున కేసీఆర్ నష్టం తీసుకొచ్చారన్నారు. తెలంగాణ, రైతు, అమరవీరుల ద్రోహి కేసీఆర్ అని మండిపడ్డారు.
తనపై ఉన్న కేసుల విషయాల్లో తన అడ్వకేట్లు కూడా అమ్ముడుపోతున్నారని, అందుకే తానే అడ్వకేట్ అవుదామనుకుంటున్నానని కేఏ పాల్ చెప్పారు. సుప్రీంకోర్టులో తాను మూడు కేసులు ఫైల్ చేసున్నానని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ‘కేసీఆర్ కళ్లు మూసుకుని పాలు కాదు.. మందు తాగుతున్నాడు. రాజశేఖర్ రెడ్డికి పట్టిన గతి కేసీఆర్ కు పడుతుంది. నన్ను చంపడానికి రాజశేఖర్ రెడ్డి, సోనియాగాంధీ ప్రయత్నించారు. నన్ను నాశనం చేద్దామని చూసిన వారు ఎవరూ లేరు.. ప్రజల కోసం దేవుని చేత పంపబడిన దూతను నేను. నేను దేశం నాశనం కాకూడదని పోరాడేవాడిని.. నేను అమరావతిని, దేశాన్ని అభివృద్ధి చేయగలను. నేను దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడుతున్నాను.. నన్ను డబ్బులతో ఎవడు కొనలేరు. దేశాన్ని అప్పుల పాల్జేస్తున్నారనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 2010 లో తన సోదరుడి హత్య జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని కేఏ పాల్ చెప్పారు. ఆ సయమంలో 8 మందిని అరెస్ట్ చేశారని చెప్పారు. తాను తన సోదరుడి హత్యకు కోటి రూపాయలు ఇచ్చానని కేసు పెట్టారని, ఆ తర్వాత అది తప్పుడు కేసుని తేలిందని స్పష్టం చేశారు.