
కడెం, వెలుగు: భూమి సర్వే ప్రొసీడింగ్స్ కోసం రైతు నుంచి లంచం డబ్బులు తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కడెం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన రైతు గుగ్లావత్ ప్రభాకర్ తన తండ్రి చనిపోగా అతని పేరిట ఉన్న 5 ఎకరాల భూమి పట్టా మార్పిడిలో భాగంగా సర్వే కోసం అప్లై చేశాడు. ప్రొసీడింగ్ ఇచ్చేందుకు కడెం తహసీల్దార్ ఆఫీస్ సర్వేయర్ ఉమాజీ పవార్ ఎకరానికి రూ. 5 వేల చొప్పున మొత్తంగా రూ. 25 వేలు డిమాండ్ చేశాడు.
రూ. 20 వేలు ఇచ్చేందుకు రైతు ఒప్పుకుని అందులో రూ. 12 వేలు గత నెల 28న సర్వేయర్ కు ఇచ్చాడు. మరో రూ. 8 వేల ఇవ్వాలంటూ సర్వేయర్ ఒత్తిడి చేస్తుండగా రూ. 7 వేలు శనివారం ఇస్తానని రైతు ప్రభాకర్ చెప్పి ఏసీబీని ఆశ్రయించాడు. సర్వేయర్ ఉమాజీకి శనివారం తహసీల్దార్ ఆఫీసులో రైతు ప్రభాకర్ రూ. 7 వేల నగదు ఇస్తుండగా ఆదిలాబాద్ జోన్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సర్వేయర్ ను అదుపులోకి తీసుకొని అనంతరం తహసీల్దార్ ఆఫీసులో సోదాలు చేశారు.