గ్యారంటీలకు నిధులేవి? బడ్జెట్​లో నిధులు సరిపోవు : కడియం

గ్యారంటీలకు నిధులేవి? బడ్జెట్​లో నిధులు సరిపోవు :  కడియం
  • రాజగోపాల్​రెడ్డి చీడపురుగు.. కాంగ్రెస్​ను నాశనం చేస్తున్నడు
  • ఎంత మొత్తుకున్నా మంత్రి కాలేడు
  • బడ్జెట్​పై చర్చ సందర్భంగా విమర్శలు

హైదరాబాద్‌, వెలుగు :  కాంగ్రెస్‌కు పట్టిన చీడ పురుగు రాజగోపాల్‌రెడ్డి అని, ఆ పార్టీని ఆయన నాశనం చేస్తున్నాడని కడియం ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్​పై చర్చ సందర్భంగా కడియం మాట్లాడుతూ రాజగోపాల్​పై విమర్శలు చేశారు. సభలో ఆయన ఎంత మొత్తుకున్నా మంత్రి పదవి రాదని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం, గ్యారంటీలపై కడియం కామెంట్లు చేసినప్పుడు రాజగోపాల్​రెడ్డి మధ్యలో కలుగజేసుకొని కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు. “ మేడిగడ్డ వద్దకు నిన్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి చూశారు. అది కుంగడం బాధాకరం,విచారకరం. మెడిగడ్డలో 2,3 పిల్లర్లు కుంగిపోయాయి.  ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించండి, బాధ్యులెవరైనా వారిపై చర్యలు తీసుకోండి..”అని కడియం శ్రీహరి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. 

బడ్జెట్​లో వాటికి 53,196 కోట్లు పెట్టారనీ, కానీ వాటికి ప్రైమరీ అంచనాగా రూ.1.36లక్షల కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. బడ్జెట్​లో ప్రకటించినట్టు ఇందిరమ్మ ఇండ్లను సెగ్మెంట్ కు 3500 చొప్పున కట్టినా, కనీసం 23వేల కోట్లు కావాలని, కానీ, బడ్జెట్ లో మాత్రం 7వేల కోట్లు పెట్టారని తెలిపారు. ప్రతినెలా మహిళలకు రూ.2500 చొప్పున ఇస్తామన్నారనీ, అది ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి సుమారు 20వేల కోట్లు అవసరం అవుతాయనీ, కానీ బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. చేయుత స్కీము ద్వారా  నెలకు రూ.4వేల పింఛన్ ఇస్తామని చెప్పినా, దానికి సరిపడ నిధులు కేటాయించలేదని ఆరోపించారు. డిసెంబర్ 9 తారీఖునే రుణమాఫీ చేస్తామని ప్రకటించారనీ, ఇప్పటికి వరకూ ఆ ప్రకటన రాలేదని చెప్పారు. కాళేశ్వరం కింద రిజర్వాయర్లు వచ్చాయనీ, నీటి స్టోరేజ్ పెరిగిందన్నారు. మేనిఫెస్టోలో ఎస్సీఎస్టీ,బీసీ, మైనార్టీలు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హమీల అమలుకు సరిపడ నిధులు కేటాయించలేదని ఆరోపించారు. బీసీలకు సబ్ ప్లాన్ పెడ్తామని,   ఏటా రూ.20వేల కోట్లు పెడ్తామని ప్రకటించి, తీరా బడ్జెట్​లో మాత్రం రూ.8వేల కోట్లే పెట్టారని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన బీసీ కులగణనను స్వాగతిస్తున్నట్టు తెలిపారు. 

రాష్ట్ర చిహ్నాన్ని మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నం

కేసీఆర్ పై కోపంతో ఆయన ఆనవాళ్లు లేకుండా చేస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నారని, కానీ అది సాధ్యం కాదన్నారు. సెక్రటేరియేట్, అంబేద్కర్ విగ్రహం, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇవన్నీ కేసీఆర్ కట్టించనివేననీ చెప్పారు. రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామని సర్కారు ప్రకటన చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. దాంట్లో కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఉందని, ఇవి తెలంగాణ గుర్తులని చెప్పారు. వీటినీ రాచరికంతో పోల్చడం సరికాదని, అలా అంటే నాలుగు సింహాలు, అశోక ధర్మచక్రం కూడా రాజముద్రలే అవుతాయా అని ప్రశ్నించారు.