- ఆ తర్వాత పార్టీ ముక్కచెక్కలు అవుతుంది
- కేటీఆర్ పై నమ్మకం లేకనే కవిత దూరమయ్యారని వ్యాఖ్య
జనగామ, వెలుగు: కేసీఆర్ ఉన్నన్ని రోజులే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని.. ఆ తర్వాత ముక్కలు చెక్కలు అవుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం ఆయన స్టేషన్ ఘన్పూర్ లో మీడియాతో మాట్లాడారు. ‘‘అయ్య పేరు చెప్పుకొని, వంశం చూసుకొని కడియం శ్రీహరి రాజకీయాలు చేయడం లేదు.
స్వతహాగా ఎదిగిన వ్యక్తి కడియం’’ అని అన్నారు. -కేటీఆర్ అహంకారి అని.. లీడర్ గా ఎదగాలంటే సభ్యత, సంస్కారం అవసరమని హితవు పలికారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో 36 మంది ఎమ్మెల్యే లు పార్టీలు మారారని, ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని.. అప్పుడు విలువలు గుర్తుకు రాలేదా అని కడియం ప్రశ్నించారు. కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం లేకనే కవిత దూరమయ్యారన్నారు. హరీశ్ రావు కూడా సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్నారని.. కేసీఆర్ ఉన్నన్ని రోజులే హరీశ్పని చేస్తారని అన్నారు.
అహంకారంతో మాట్లాడినంత మాత్రాన కేటీఆర్ నాయకుడు కాలేరని అన్నారు. కేటీఆర్ పై 10 కేసులు ఉన్నాయని.. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడి రాజకీయం చేసి దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ లో అంతా గోకుడు, గికుడు గాళ్లు ఉన్నారని.. వారిని వెంటేసుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సహించేది లేదని కడియం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కుటుంబాలు అనేక స్కాంలు చేశాయని.. కవిత మాట్లాడే ప్రతిమాటకు ఎవిడెన్స్ ఉంటుందని.. కేటీఆర్ ముందు తన చెల్లికి సమాధానం చెప్పాలని శ్రీహరి డిమాండ్ చేశారు.
