కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్లు 17శాతమే : కేటీఆర్

కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్లు 17శాతమే : కేటీఆర్
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు  ఇస్తామని మోసం చేసింది: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేసిందని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శించారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం 24 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 శాతమే ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. 

రిజర్వేషన్ల పేరుతో నాటకాలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీసీ సోదరులు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ భవన్​లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​ ఆధ్వర్యంలో పలువురు నేతలు బీఆర్​ఎస్​లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. రేవంత్​ రెడ్డి సీఎంలా కాకుండా.. రియల్​ ఎస్టేట్​ ఏజెంట్​లా పనిచేస్తున్నారని విమర్శించారు. 

మొదట మూసీ భూములు, ఆ తర్వాత ట్రిబుల్​ ఆర్, సెంట్రల్​ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవంత్​ రెడ్డి.. ఇప్పుడు హిల్ట్​ పాలసీ పేరుతో ఇండస్ట్రియల్​ భూముల కుంభకోణానికి తెరతీశారని ఫైర్​ అయ్యారు. ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి ఇండస్ట్రియలిస్టులు చవకగా భూములు తీసుకున్నారని.. ఇప్పుడు ఆ భూముల్లో అపార్ట్​మెంట్లు, విల్లాలు కట్టేందుకు రేవంత్​ రెడ్డి అతి తక్కువ ధరకే అనుమతులిస్తూ రియల్​ ఎస్టేట్​ దందా చేస్తున్నారని ఆరోపించారు. 

కేవలం ఐదారు వందల మంది కోసం.. 9,300 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రూ.5 లక్షల కోట్ల ప్రజల ఆస్తిని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఇందులో సగం డబ్బులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. 

ప్రైవేట్ వ్యక్తులకు భూములను అప్పజెప్పే ఈ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్​ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా అద్భుతంగా అభివృద్ధి చెందిందని కేటీఆర్​ అన్నారు. వలసల జిల్లాగా పేరుబడిన పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ సాధ్యమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు.