ఇదేం దర్యాప్తు?.. సిగాచీ ఘటన ఇన్వెస్టిగేషన్ పై హైకోర్టు తీవ్ర అసహనం

ఇదేం దర్యాప్తు?.. సిగాచీ ఘటన ఇన్వెస్టిగేషన్ పై హైకోర్టు తీవ్ర అసహనం

హైదరాబాద్, వెలుగు: సిగాచీ పేలుడు ఘటన దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 54 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో  ఇప్పటిదాకా 237 మందిని విచారించినా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారా? అని సర్కారుపై ఫైర్ అయింది. దర్యాప్తు వివరాలు సమర్పించకపోవడంపై మండిపడింది. ఇన్వెస్టిగేషన్ లో స్థానిక పోలీసులకు నైపుణ్యం ఉందా అని మండిపడింది. 

నిపుణులతో సిట్ ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. కేసు డైరీ, తగిన రికార్డులతో సహా దర్యాప్తు అధికారి వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశిస్తూ విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది. సిగాచీ బాధితులకు పరిహారంతోపాటు దర్యాప్తును సిట్‌‌కు అప్పగించాలని హైదరాబాద్‌‌కు చెందిన కె.బాబూరావు వేసిన పిల్‌‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. 

పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ..కంపెనీ ఉత్పత్తి పెంచడం, 17 టన్నుల ప్రమాదకర రసాయనాలు నిల్వ వంటి ఉల్లంఘనలను నిపుణుల కమిటీ గుర్తించిందని తెలిపారు. కంపెనీ ప్రకటించిన రూ.కోటి పరిహారంలో కేవలం రూ.25 లక్షలు మాత్రమే చెల్లించారని చెప్పారు. 

మరో 15 మందిని విచారించాల్సి ఉంది

ప్రభుత్వం తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. ఈ కేసులో మరో 15 మందిని విచారించాల్సి ఉందన్నారు. నిపుణుల కమిటీ నివేదికపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోర్టు స్పందిస్తూ...దర్యాప్తు ఏ దశలో ఉందో కూడా తెలియజేయడం లేదని అసహనం వ్యక్తం చేసింది. సిగాచీ కంపెనీ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కావాలన్న అభ్యర్థనకు కోర్టు అనుమతించింది.