- ప్రస్తుత సిబ్బందిపై తప్పని పనిభారం
- 360 జేఏ పోస్టులకు వచ్చిన 6,500 అప్లికేషన్లు
- పరీక్ష పెట్టాలని ఉద్యోగులు, కార్మిక సంఘాల డిమాండ్
కోల్ బెల్ట్,వెలుగు: సింగరేణి బొగ్గు గనులు, డిపార్ట్ మెంట్లు, ఆఫీసుల్లో క్లరికల్ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతమున్న సిబ్బందిపై భారం పడుతోంది. దీన్ని తగ్గించేందుకు అర్హత కలిగిన ఉద్యోగులతో పనులు చేయిస్తున్నారు. వీరికి పూర్తిస్థాయిలో అవగాహన లేక పెండింగ్ పడుతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు తొలగించేందుకు ఇంటర్నల్ జూనియర్ అసిస్టెంట్(క్లరికల్) ఉద్యోగాల భర్తీకి 2024, మార్చిలో సింగరేణి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
19 నెలలు గడుస్తున్నా ఇంకా పరీక్ష నిర్వహించలేదు. దరఖాస్తు చేసుకున్న వేలాది మంది ఇంటర్నల్ ఉద్యోగులు నెలలుగా ఎదురు చూస్తున్నారు. అయినా, సింగరేణి ఆఫీసర్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
360 పోస్టుల భర్తీ కోసం..
సింగరేణిలోని ఎనిమిది విభాగాల్లో జూనియర్ అకౌంట్ ఆఫీసర్, అండర్ మేనేజర్ ట్రైనీ, అసిస్టెం ట్ ఇంజనీరు, డిప్లమో ఇంజనీరింగ్ అండ్ మైనింగ్, వెల్డర్ ట్రైనీ, ఫిట్టర్ ట్రైనీ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. మొత్తం 360 పోస్టుల భర్తీకి ఇంటర్నల్ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో మొత్తం 6,500 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది తర్వాత వీటిలో కొన్నింటిని దివ్యాంగులకు కేటాయిస్తూ గత ఫిబ్రవరిలో రివైజ్ డ్ నోటిఫికేషన్ ఇచ్చింది. .
కాగా.. రాత పరీక్షల నిర్వహణపై మాత్రం సింగరేణి జాప్యం చేస్తోంది. వేల రూపాయలు వెచ్చించి అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా పరీక్ష నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు అదే నోటిఫికేషన్ లో పేర్కొన్న మిగిలిన విభాగాల్లోని ఖాళీ పోస్టులకు పరీక్షలు నిర్వహించింది.
పని భారమైనా తప్పని పరిస్థితి..
సింగరేణిలో వివిధ విభాగాల్లో క్లరికల్ ఉద్యోగులు రిటైర్ మెంట్ కావడంతో ఉన్నవారిపైనే పని భారం పడింది. సంస్థలో 800 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. బొగ్గు గనులు, డిపార్ట్ మెంట్లు, ఆఫీసుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండడంతో పని భారాన్ని తగ్గించేందుకు ఇటీవల డిపెండెంట్ ఉద్యోగాల ద్వారా చేరిన విద్యావంతులైన ఉద్యోగులతో పనులు చేయిస్తోంది. వీరికి పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో పనులు పెండింగ్ పడుతున్నాయి. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నా తొలగించేందుకు ఆఫీసర్లు సాహసించడంలేదు.
పరీక్ష నిర్వహిస్తే తీరనున్న సిబ్బంది కొరత
సింగరేణి సీఎండీగా ఎన్.బలరాం బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని ఏరియాల్లో పర్యటించిన సందర్భంగా జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష నిర్వహించాలని ఇంటర్నల్ ఉద్యోగులు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినా, ఇంకా పరీక్ష తేదీని ప్రకటించలేదు. త్వరగా పరీక్షలు నిర్వహిస్తే సిబ్బంది కొరత తీరడంతో పాటు ప్రస్తుత ఉద్యోగులపై పనిభారం తప్పనుంది. వెంటనే పరీక్ష నిర్వహణకు సింగరేణి ఆఫీసర్లు చొరవ చూపాలని దరఖాస్తు చేసుకున్న ఇంటర్నల్ ఉద్యోగులు కోరుతున్నారు.
