ఆశలు గల్లంతు.. ఎన్నికలకు ముందు లక్షల్లో ఖర్చు

ఆశలు గల్లంతు.. ఎన్నికలకు ముందు లక్షల్లో ఖర్చు
  •  పంచాయతీ సమరంలో అనుకూలించని రిజర్వేషన్​
  •  నిరాశలో ఆశవాహులు

 కామారెడ్డి, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి, తమ సత్తా చాటాలని ఎంతో మంది ఆశవాహులు ముందస్తు వ్యూహాలు రచించుకున్నారు.  ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సరే  తాము బరిలో ఉండవచ్చనే ధీమాతో  సర్పంచ్​ పదవిపై ఆశలు పెట్టుకొని  పలువురు  మండల, గ్రామ స్థాయి లీడర్లు,  ఇతరులు తమ  ప్రయత్నాల్లో  మునిగితేలారు.  ఓటర్లను ఆకట్టుకునేందుకు  ఏడాదిన్నరకు పైగా  కామారెడ్డి జిల్లాలో  పలు గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టారు.   

లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు.  అయితే  రొటేషన్​ పద్దతిలో రిజర్వేషన్లు మారటం,  డ్రాలో మహిళలకు రిజర్వు కావటం వంటి పరిస్థితుల్లో  ముందు నుంచి ఖర్చు పెట్టుకున్న  వ్యక్తుల ఆశలు గల్లంతయ్యాయి.  చేసేదేమీ లేక  ఇప్పుడు పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. రిజర్వేషన్​ కలిసి రాక  పంచాయతీ ఎన్నికల్లో  పోటి చేసే అవకాశం లేకపోవటంతో  కొందరు కొందరు సైలెన్స్​ కాగా కొన్ని  చోట్ల తమ అనుచరులను బరిలో దింపేందుకు  కసరత్తు చేస్తున్నారు. 

గణేశ్​ చందా నుంచి బోర్ల తవ్వకం దాకా.. 

కామారెడ్డి  జిల్లాలో  గత పంచాయతీ పాలక వర్గాల  కాల పరిమితి ముగిసినప్పటి నుంచి   ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఆశవాహులు కళ్లలో వత్తులు వేస్కొని ఎదరు చూశారు.   స్థానిక లీడర్లు,  యువత వివిధ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేశారు.    గ్రామాన్ని  బట్టి సామాజిక సేవా కార్యక్రమాలకు  రూ. 3 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఖర్చు పెట్టారు.   మేజర్​ పంచాయతీలు, మండల కేంద్రాల్లో  భారీగా ఖర్చు  పెట్టారు. బోర్ల తవ్వకం, మోటార్ల బిగింపు,  వైకుంఠ రథాలు చేయించటం,  స్కూల్స్​లో మౌలిక వసతులు కల్పించటం, రంగులు వేయించటం,   సంఘాలు, టెంపుల్స్​ వద్ద కంపౌండ్​ వాల్స్​ నిర్మాణం, సిమెంట్​ పనులు, గణేష్​ మండపాలకు, దుర్గామాతల మండపాలకు  భారీగా చందాలు ఇవ్వటం,  కొందరయితే ఆ సంఘం ఓటర్లను బట్టి మండపాలను పూర్తి ఖర్చుతో  ఏర్పాటు చేయించారు.  

 వీటితో పాటే  అనుచరులకు, ఆయా సంఘాల ప్రతినిధులకు దావతుల వంటి చేస్తూ  ఓటర్లలో పేర్లు నానే విధంగా చూసుకున్నారు.  లక్షలాది రూపాయలు ఖర్చు పెడితే  తీరా  పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాల్లో రిజర్వేషన్లు వారికి  అనుకూలించలేదు.  

ఇదీ పరిస్థితి... 

భిక్కనూరు మండల కేంద్రంలో స ర్పంచ్​ పదవి కోసం పలువురు పోటీ పడ్డారు. గత ఏడాది కాలంగా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అధిక మొత్తంలో ఖర్చు చేస్తూ వచ్చారు.  సేవా కార్యక్రమాలు చేపట్టడం,  గణేశ్​, దుర్గా మండపాలకు అధిక మొత్తంలో చందాలు ఇచ్చారు.  రూ.లక్షల్లో ఖర్చు చేశారు.  ఇక్కడ  జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. తమకు అవకాశం రానందున తమ కుటుంబ సభ్యుల్లో మహిళలతో పోటి చేయిద్దామంటే వారు ముందుకు రావటం లేదని సమాచారం. 

పిట్లం మండల కేంద్రంలో  ఓ నాయకుడు సర్పంచ్​ పదవికి  పోటి చేయాలనే అలోచనతో  ఏడాదిన్నర కాలంగా వివిధరకాలుగా రూ.లక్షల్లో ఖర్చు ఖర్చు  చేశారు. ఇక్కడ సర్పంచ్​ పదవి  బీసీ కి రిజర్వు అయ్యింది.  ముందు నుంచి  ఫ్లాన్​తో ఉన్న  లీడర్​కు పోటికి అవకాశం లేదు. 

రామారెడ్డి మండలంలోని ఓ చిన్న పంచాయతీలో  సర్పంచ్​ పదవిపై కన్నేసిన ఒకరు కొద్ది రోజులుగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. మహిళకు రిజర్వు కావటంతో ఆయన పోటికి దూరమయ్యారు. 

బీబీపేట,  గాంధారి, మాచారెడ్డి, పాల్వంచ , రాజంపేట తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో  పోటికి దూరమయ్యారు.   తమ అనుచరులను పోటికి దింపేందుకు సమాలోచనలు చేస్తున్నారు.