రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఒక్కటవుదాం : డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఒక్కటవుదాం :  డిప్యూటీ సీఎం భట్టి
  • పార్టీలకు అతీతంగా పార్లమెంట్‌లో గళమెత్తండి.. ఎంపీలకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు

హైదరాబాద్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా తెలంగాణ ఎంపీలంతా ఢిల్లీలో గళమెత్తాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం ప్రజాభవన్‌లో రాష్ట్ర ఎంపీలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పార్లమెంట్‌లో రాష్ట్రం తరఫున ప్రస్తావించాల్సిన అంశాలు, పెండింగ్‌లో ఉన్న నిధులు, ప్రాజెక్టులపై అధికారులతో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. 12 శాఖలకు సంబంధించిన 47 కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించారు.

బీసీ బిల్లుపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఆమోదం కోసం 9వ షెడ్యూల్‌లో సవరణ జరగాల్సిన ఆవశ్యకతను భట్టి విక్రమార్క వివరించారు. కులగణన (ఎపిక్ సర్వే) ఆధారంగా, ఎంపిరికల్ డేటాతో అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ బిల్లు.. ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ‘వాయిదా తీర్మానం’ లేదా ‘ప్రశ్నోత్తరాల సమయం’లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చర్చకు తీసుకురావాలని ఎంపీలను కోరారు. 

అవసరమైతే అన్ని పార్టీల ఎంపీలు కలిసి ప్రధానమంత్రికి వినతి పత్రం ఇవ్వాలని, ఆయన సమయం ఇస్తే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సెమీ కండక్టర్ల పరిశ్రమ అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది.

డిసెంబర్ 9న ‘విజన్ 2047’

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 9న ‘విజన్ 2047’డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నట్లు భట్టి తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నామని, దీనికి సహకరించాలని ఎంపీలను కోరారు.

ఢిల్లీలో ప్రత్యేక వార్ రూమ్

అసెంబ్లీ సమావేశాలకు యంత్రాంగం ఎంత సంసిద్ధంగా ఉంటుందో, పార్లమెంట్ సమావేశాల సమయంలోనూ అదే స్థాయిలో పని చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఎంపీలు అడిగే సమాచారాన్ని నిమిషాలు, గంటల వ్యవధిలో అందించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నీటిపారుదల, విద్యుత్, జీఎస్టీ బకాయిలపై గతంలో రాసిన లేఖలు అక్కడ అందుబాటులో ఉంటాయని, వాటి ఆధారంగా ఎంపీలు ఫాలోఅప్ చేయాలని సూచించారు.

ఎంపీల కీలక ప్రతిపాదనలు ఇవే..

 మెదక్ ఎంపీ రఘునందన్ రావు (బీజేపీ): 

రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల కోసం ప్రధానిని సమిష్టిగా కలుద్దామని ప్రతిపాదించారు. ఆదిలాబాద్ – పటాన్‌చెరు రైల్వేలైన్ డీపీఆర్, రాష్ట్రానికి ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ కేటాయింపు, బొగ్గు గనుల అంశాలపై పార్టీలకు అతీతంగా సంబంధిత కేంద్ర మంత్రులను కలుద్దామని సూచించారు.

నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి:


రఘునందన్ రావు ప్రతిపాదనను మల్లు రవి స్వాగతించారు. పెండింగ్ ప్రాజెక్టులపై అఖిలపక్షంగా ప్రధానికి లేఖ ఇవ్వాలన్నారు. మహబూబ్‌నగర్ ఎయిర్ పోర్ట్, గద్వాల- – డోర్నకల్ రైల్వే లైన్‌పై సమాచారం కోరారు.

 మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్:

పోలవరం బ్యాక్ వాటర్​తో లక్ష మందికి పైగా గిరిజనులు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని, దీనిపై పరిష్కారం చూపాలని కోరారు. ములుగు – ఏటూరు నాగారం రహదారికి ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్యను లేవనెత్తారు.

 జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్:


ఉపాధి హామీ పథకంలో పని దినాలు తగ్గడంతో గ్రామీణ ఉపాధి దెబ్బతింటున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జహీరాబాద్ – -బీదర్ రహదారి అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించాలన్నారు.

ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్​ (బీజేపీ): 

ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కోసం సేకరిస్తున్న భూమిపై స్పష్టత కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. విమానాశ్రయం, ఇతర అవసరాలకు కలిపి మొత్తం వెయ్యి ఎకరాలు అవసరమని, ఇప్పటికే ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 700 ఎకరాలు సేకరిస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

వరంగల్ ఎంపీ కడియం కావ్య: 

వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్  వ్యవస్థ ఏర్పాటు కోసం కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. 

ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్, రఘురాంరెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.