- కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దద్దమ్మలు
- కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు, భాష మార్చుకోకుంటే బుద్ధి చెప్తం
- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేని దద్దమ్మలు అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, అన్ని పార్టీల నాయకులు కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. డివిజన్ ఏర్పాటుకు కాజీపేటకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. డివిజన్ ఏర్పాటైతే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. 12 ఏండ్లుగా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ సహకరించడం లేదని, అసలు తెలంగాణ ఏర్పడడమే ప్రధాని మోదీకి ఇష్టం లేదన్నారు.
ఏపీకి వేల కోట్ల అదనపు నిధులు, ప్రాజెక్టులు, యూనివర్సిటీలు ఇస్తున్న కేంద్రం.. తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్న రూపాయిలో 32 పైసలు మాత్రమే తిరిగి ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టేందుకే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి పదవులు ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు తెచ్చామని బండి సంజయ్ చెబుతున్నారని... వాటి లెక్కలు, ఆ నిధులతో ఏం అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సీఎం రేవంత్‌రెడ్డిని తెలంగాణ ద్రోహి అని సంబోధించడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు. అధికారం పోయిందన్న అక్కసుతో కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని తెలిసే సొంత చెల్లెలు వదిలి వెళ్లిపోయిందన్నారు. కేటీఆర్ భాష మార్చుకోకుంటే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీశ్‌రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
