
కాగజ్ నగర్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని కాగజ్ నగర్ నవోదయ పూర్వ విద్యార్థి, కూలీ కుటుంబానికి చెందిన యువతి మైక్రోసాఫ్ట్లో రూ.51 లక్షల ప్యాకేజీతో కొలువు దక్కించుకుంది. మంచిర్యాల జిల్లా ముడిమడుగు గ్రామానికి చెందిన బదావత్ రవీణా కాగజ్ నగర్ జవహర్ నవోదయలో 2022లో పన్నెండో తరగతి కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఎలాంటి కోచింగ్ లేకుండానే జేఈఈలో ర్యాంక్ సాధించి ఐఐటీ అలహాబాద్ లో సీటు సంపాదించింది. అక్కడ ఇంటర్న్షిప్ చేస్తూనే మైక్రోసాఫ్ట్లో ఏడాదికి రూ.51 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించింది.
ఆమె తల్లిదండ్రులు ప్రభాకర్, వినీత వ్యవసాయ కూలీలు. రవీణ సాధారణ కూలీ కుటుంబం నుంచి ప్రపంచ దిగ్గజ కంపెనీలో కొలువు సాధించడంపై నవోదయ ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. విద్యాలయ గౌరవాన్ని పెంచిందని, స్టూడెంట్లకు ప్రేరణగా నిలిచిందని కొనియాడారు.