కాజల్ అగర్వాల్ నుంచి తెలుగు సినిమా వచ్చి రెండేళ్లు అవుతోంది. గత ఏడాది ‘కన్నప్ప’లో కనిపించినా అది అతిథి పాత్ర. ఇక హిందీలో సల్మాన్ సినిమా ‘సికిందర్’లో కీలకపాత్ర పోషించినా అది డిజాస్టర్ అయింది.
ఈ నేపథ్యంలో సోమవారం తన కొత్త సినిమా ‘ది ఇండియా స్టోరీ’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్ఫడే లీడ్ రోల్స్‌లో రూపొందుతున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. జులై 24న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుందని ప్రకటించారు.
పంట పొలాల్లో వాడే రసాయనాలు, వాటిని తయారు చేసే పెస్టిసైడ్ కంపెనీల స్కామ్‌ల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద సంక్షోభంగా దీన్ని చూపిస్తూ, వ్యవస్థలోని లోపాలు, కఠినమైన నియంత్రణలు అవసరం అనే అంశాలను ఇందులో చర్చించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఇందులో కాజల్ అగర్వాల్ పవర్‌ఫుల్ లాయర్‌గా కనిపించనుంది. సాగర్ బి షిండే నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేస్తోంది.

