- కరెంట్ ఆదాకు సోలార్ ప్లేట్స్, ఎల్‍ఈడీ బల్బులు
- నీటి సంరక్షణకు 5 చెరువుల తవ్వకాలు
- వృథానీటి రిసైక్లింగ్‍కు సీవెజ్ ట్రీట్‍మెంట్ ప్లాంట్లు
- గ్రీనరీగా ఉండేలా చుట్టూ చెట్ల పెంపకం
వరంగల్, వెలుగు : కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ‘గ్రీన్ క్యాంపస్ కాన్సెప్ట్’ తో సరికొత్తగా నిర్మిస్తున్నారు. సహజ సిద్ధంగా సూర్యుడి వెలుతురు పడేలా.. జల వనరులను సంరక్షించుకునేలా రైల్వే అధికారులు పనులు చేపడుతున్నారు. చెరువులు, కుంటల తవ్వకాలు చేస్తున్నారు. షెడ్లకు వినియోగించే రేకుల నుంచి విద్యుత్ బల్బ్ వరకు గ్రీన్ కాన్సెప్ట్ ను అమలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ చుట్టూ గ్రీనరీగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
కోచ్ ఫ్యాక్టరీని160.4 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయి. తొలిదశలో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ రూ.521 కోట్లను వెచ్చించింది. కోచ్‍లు, వ్యాగన్లు, ఇంజిన్లు తయారీకి 60,933 చదరపు మీటర్ల ఏరియాలో నిర్మాణాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీ పైకప్పుతో పాటు ఇరువైపులా గ్లాస్ తో కూడిన రేకులను వినియోగిస్తున్నారు. ఉదయం లైట్ల అవసరం లేకుండా ఉండేలా.. కరెంట్ వాడకాన్ని ఆదా చేసేలా నిర్మాణాలు చేస్తున్నారు. మెగావాట్ పీక్ (ఎండబ్ల్యూపీ) లార్జ్ స్కేల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ షెడ్ స్టైల్ రూఫ్స్ ను నిర్మిస్తున్నారు. ఎక్కువ విద్యుత్ అవసరం లేకుండానే ఫ్యాక్టరీ అంతా ఎల్‍ఈడీ బల్బులు, నాణ్యమైన కరెంట్ సామగ్రి వినియోగిస్తున్నారు.
నీటి సంరక్షణకు చెరువుల తవ్వకం
కోచ్ ఫ్యాక్టరీ యూనిట్ ను కాలుష్యం లేకుండా ప్లాన్ చేశారు. ఫ్యాక్టరీ చుట్టూ5 చిన్న పాటి చెరువులను తవ్వించారు. వానాకాలంలో పడే నీటిని ఫ్యాక్టరీ అవసరాలకు వాడుకోవడంతో పాటు చుట్టూ గ్రౌండ్ వాటర్ పెంచేందుకు చెరువుల తవ్వకానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్‍ఎంయూలో వేలాది మంది సిబ్బంది పనిచేసేటప్పుడు వివిధ అవసరాలకు వాడే వృథా నీటిని రిసైక్లింగ్ చేయడం ద్వారా తిరిగి మొక్కల పెంపకం, ఇతర రోజువారి పనులకు వినియోగించుకునేలా సీవేజ్ ట్రీట్‍మెంట్ ప్లాంట్స్, వేస్ట్ వాటర్ రిసైక్లింగ్ ప్లాంట్స్ నిర్మిస్తున్నారు. ఫ్యాక్టరీ చుట్టూ ఖాళీ స్థలాల్లో భారీ ఎత్తున మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా కోచ్ ఫ్యాక్టరీలో గ్రీన్ కాన్సెప్ట్ కు శ్రీకారం చుట్టి రైల్వే అధికారులు సక్సెస్ అయ్యారు.
