ఉమ్మడి వరంగల్లో ఉత్సాహంగా కాకా క్రికెట్‌‌ టోర్నీ

ఉమ్మడి వరంగల్లో ఉత్సాహంగా కాకా క్రికెట్‌‌ టోర్నీ

హనుమకొండ, వెలుగు : హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్, విశాక ఇండస్ట్రీస్‌‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ-20 క్రికెట్‌‌ టోర్నీ హోరాహోరీగా కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్‌‌లోని వంగాలపల్లి, రెడ్డిపురం టీవీవీఎస్‌‌ సుకాంత్‌‌ గ్రౌండ్‌‌లో శుక్రవారం (జనవరి 9) మ్యాచ్‌‌లు నిర్వహించగా.. వరంగల్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ సెక్రటరీ చాగంటి శ్రీనివాస్, వివిధ జిల్లా సెక్రటరీలు, ఇతర నాయకులు పర్యవేక్షించారు. 

వంగాలపల్లిలో శుక్రవారం ఉదయం జరిగిన మ్యాచ్‌‌లో కరీంనగర్‌‌ టీమ్‌‌ వరంగల్‌‌పై తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌‌ చేసిన కరీంనగర్‌‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు సాధించింది. ఛేజింగ్‌‌కు దిగిన వరంగల్‌‌ 19.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌట్‌‌ అయింది. కరీంనగర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ తక్షిల్‌‌ 56 రన్స్‌‌ చేసి మ్యాన్‌‌ ఆఫ్‌‌ది మ్యాచ్‌‌గా నిలిచాడు. 

మధ్యాహ్నం నిజామాబాద్, మెదక్ టీమ్‌‌ల మధ్య మ్యాచ్‌‌ జరుగగా.. మొదట బ్యాటింగ్‌‌ చేసిన మెదక్‌‌ 20 ఓవర్లలో 119 పరుగులు చేసింది. 120 పరుగుల టార్గెట్‌‌తో బరిలోకి దిగిన నిజామాబాద్‌‌ 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాన్‌‌ ఆఫ్‌‌ ది మ్యాచ్‌‌గా నిలిచిన సాయి ప్రతీక్‌‌కు స్థానిక సర్పంచ్‌‌ మేనక బహుమతి ప్రదానం చేశారు.

రెడ్డిపురంలో... 

హనుమకొండ రెడ్డిపురంలోని టీవీవీఎస్‌‌ సుకాంత్ గ్రౌండ్‌‌లో ఉదయం రంగారెడ్డి, ఖమ్మం మధ్య మ్యాచ్‌‌ జరిగింది. మొదట బ్యాటింగ్‌‌కు దిగిన రంగారెడ్డి 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. ఖమ్మం 17.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌట్‌‌ అయింది. రంగారెడ్డి జట్టులో నవనీత్‌‌రావు 14 బౌండరీలు, రెండు సిక్సర్లతో 91 పరుగులు సాధించి మ్యాన్‌‌ ఆఫ్‌‌ ది మ్యాచ్‌‌గా నిలిచాడు. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్‌‌లో మహబూబ్‌‌నగర్‌‌, నల్గొండ జట్లు తలపడ్డాయి. 

మొదట మహబూబ్‌‌నగర్‌‌ జట్టు 181 పరుగులు చేయగా.. నల్గొండ 17.5 ఓవర్లలోనే ఐదు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో విన్నర్‌‌గా నిలిచింది. నల్గొండ బ్యాట్స్‌‌మన్‌‌ సాయినాథ్ ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 30 బంతుల్లోనే 72 పరుగులు చేసి నల్గొండ టీమ్‌‌ను గెలిపించాడు. ఆయా కార్యక్రమాల్లో ఉప సర్పంచ్ రవిచందర్, సుధాకర్‌‌నాయక్‌‌, క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ నాయకులు చేకూరి వెంకటేశ్వర్లు, భార్గవ్, సురేశ్‌‌, అచ్చ వెంకటేశ్వర్లు, రఘురాం, తోట రాము పాల్గొన్నారు.