- గతంలో హెచ్‍సీఏ అధ్యక్షుడిగా క్రికెట్ పోటీలు పెట్టించా
- తర్వాత వీ6 వెలుగు తరఫున టోర్నీలు
- ఇప్పుడు కాకా వెంకటస్వామి క్రికెట్ లీగ్ నిర్వహిస్తున్నామని వెల్లడి
వరంగల్/హనుమకొండ, వెలుగు: ఐపీఎల్ అట్మాస్పియర్‌లో కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తూ గ్రామీణ క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, విశాక ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో జనగామ జిల్లా వంగాలపల్లి డబ్ల్యూసీఏ స్టేడియంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ20 క్రికెట్ లీగ్ సెకండ్ ఫేజ్ పోటీలను శనివారం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్లు ఇనగాల వెంకట్రామిరెడ్డి, ఆయూబ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ముందుగా మంత్రి వివేక్‌తో పాటు మిగతా నాయకులు ఆదిలాబాద్, కరీంనగర్ మ్యాచ్ కు టాస్ వేసిన అనంతరం కాసేపు బ్యాటింగ్, బౌలింగ్ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వివేక్ మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి మెమోరియల్ క్రికెట్ లీగ్ లో ప్రతి జట్టుకు డ్రెస్ కోడ్, స్టేడియంలో అత్యాధునిక ఎక్విప్‍మెంట్, సీనియర్ కోచ్‌లు, టీవీల్లో లైవ్ స్ట్రీమింగ్‌తో ఐపీఎల్‍తో సమానంగా క్రికెట్ వాతావరణం కల్పించామన్నారు.
టీవీలో లైవ్ మ్యాచ్‍లను సుమారు 20 వేల మంది చూస్తున్నారని.. ఇదే గ్రామీణ క్రీడాకారుల సత్తా, కాకా క్రికెట్ లీగ్‍కు ఉన్న ఆదరణను తెలుపుతోందన్నారు. తాను హెచ్‍సీఏ అధ్యక్షుడిగా పని చేసిన టైంలో గ్రామీణ క్రికెటర్లను ప్రొత్సహించేందుకు 2018లో తెలంగాణ క్రికెట్ లీగ్ పోటీలు పెట్టినట్లు మంత్రి చెప్పారు.
ఆ తర్వాత ‘వీ6 వెలుగు’ పేపర్ ఆధ్వర్యంలోనూ జిల్లాల్లో క్రికెట్ టోర్నమెంట్లు ఏర్పాటు చేశామని, ప్రస్తుతం కాకా క్రికెట్ లీగ్ తో పల్లె క్రికెటర్లకు సరైన ప్లాట్‌ఫాం క్రియేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. హెచ్‍సీఏ ప్రెసిడెంట్‍గా తాను అన్ని జిల్లాల్లో క్రికెట్ గ్రౌండ్స్ ఉండేలా భూముల కొనుగోలుకు ఆలోచన చేసినట్లు తెలిపారు. జిల్లాల్లో క్రికెట్‌కు అనువుగా ఉండేలా కృత్రిమ గడ్డితో కూడిన అపెక్స్ టర్ఫ్ వికెట్స్ ఏర్పాటు విషయమై మాట్లాడతానన్నారు.
ఉప్పల్ స్టేడియం కోసం ‘కాకా’ కృషి: బస్వరాజు సారయ్య
పేదల సంక్షేమం, గ్రామీణ క్రీడాకారుల కోసం ‘కాకా’ కుటుంబంలోని మూడు తరాలు సేవలు అందించాయని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. పేద ప్రజలకు గూడు కల్పించే క్రమంలో కాకా వెంకటస్వామి నిరుపేదల గుండెల్లో ‘గుడిసెల వెంకటస్వామి’గా పేరు గాంచారన్నారు.
ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి కాకా ఎంతో కృషి చేశారన్నారు. కాకా కుటుంబసభ్యులు మొదటి నుంచీ పేద ప్రజలకు దగ్గరగా ఉండాలన్న ఆలోచనతోనే ఉన్నారన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి వివేక్ వెంకటస్వామి రాష్ట్రంలో ఎనలేని కృషి చేస్తున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్ పిలుపు.. మంత్రి వివేక్ ప్రోత్సాహం: కేఆర్ నాగరాజు
‘మత్తు వదలండి.. మైదానాలకు రండి’ అన్న నినాదంతో సీఎం రేవంత్‌రెడ్డి క్రీడాపోటీల నిర్వహణకు కృషి చేస్తుంటే.. కాకా కుటుంబ సభ్యులు గ్రామీణ క్రీడాకారులు, యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‍కు స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం మంజూరు చేసిందని, త్వరలోనే శంకుస్థాపన జరగనున్నట్లు పేర్కొన్నారు.
కుడా చైర్మన్, హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ ఇనగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఓరుగల్లులో స్టేడియం నిర్మాణానికి భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ చైర్మన్ ఆగమరావు, వరంగల్ క్రికెట్ అసొసియేషన్ సెక్రటరీ చాగంటి శ్రీనివాస్, డబ్ల్యూసీఏ అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్‌గౌడ్, ఉపాధ్యక్షు డు అచ్చ వెంకటేశ్వర్లు, సదాశివుడు, తోట రాము, సంయుక్త కార్యదర్శి ఉపేందర్, సభ్యులు అభినవ వినయ్, కోచ్ ప్రణయ్, శంకర్ పాల్గొన్నారు.
వరంగల్ జట్టుపై హైదరాబాద్ విజయం
ఓరుగల్లులో శనివారం నిర్వహించిన తొలి మ్యాచ్‍లో వరంగల్ జట్టుపై హైదరాబాద్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి164 పరుగులు చేసింది. హైదరాబాద్ జట్టులో వినీత్ పవార్ మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 65 పరుగులు చేశాడు. ఆపై 165 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన వరంగల్ 19 ఓవర్లలో 141 రన్స్‌కు ఆలౌట్ అయింది. దీంతో 23 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా వినీత్ పవార్ నిలిచాడు.
కరీంనగర్‍పై ఆదిలాబాద్ గెలుపు
రెండో మ్యాచ్‍లో కరీంనగర్, ఆదిలాబాద్ టీమ్స్ తలపడగా.. మొదట ఆదిలాబాద్ నిర్ణీత18 ఓవర్లు ఎదుర్కొని 133 పరుగులు సాధించింది. సంతోష్ కేవలం 44 బంతుల్లో నాలుగు సిక్సర్లు, నాలుగు బౌండరీలతో 62 పరుగులు చేశాడు. తర్వాత 134 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ జట్టు 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసి 10 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఆదిలాబాద్ ప్లేయర్ సంతోష్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‍గా ఎంపికయ్యాడు.
