
ముషీరాబాద్,వెలుగు : కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కాకా వెంకటస్వామి తొమ్మిదో వర్ధంతి, అంబేద్కర్ విద్యా సంస్థల గ్రాడ్యుయేషన్ డే, అలూమ్ని వేడుకలు శుక్రవారం బాగ్‌లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్, రాజ్ ఠాకూర్, విద్యాసంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్, కాకా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ముందుగా సీఎం రేవంత్ రెడ్డికి ఎన్ సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కాకా విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతకుముందు సీఎం రాక సందర్భంగా కాలేజీ స్టూడెంట్లు లేచి కేరింతలు కొట్టారు. సీఎం వారిని చూసి అభివాదం చేస్తూ స్టేజీ ఎక్కారు. కార్యక్రమంలో భాగంగా కాలేజీలో చదివి స్టేట్ లెవెల్ ర్యాంకులు సాధించిన పలువురు స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్‌తో పాటు సర్టిఫికెట్లను ముఖ్యమంత్రి అందజేసి అభినందించారు. కల్చరల్
యాక్టివిటీస్ ఆకట్టుకోగా.. ఇందులో కాకా ప్రత్యేక పాటలతో స్టూడెంట్లు సందడి చేశారు. ఆయన సేవలకు గుర్తుగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో దిగిన ఫొటో గ్యాలరీ ఎంతో ఆకర్షించింది. అలూమ్ని కూడా నిర్వహించగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన పూర్వ విద్యార్థులు ఇనిస్టిట్యూషన్‌లో చదివిన రోజులను గుర్తుచేసుకుని సంబురపడ్డారు.
చాలా హ్యాపీగా ఉంది
కాకా బీఆర్ అంబేదర్క్ ఇనిస్టిట్యూషన్స్‌లో ఆదరించి అభిమానించే వారు ఉండడంతోనే టాపర్‌గా నిలిచా. సీఎం నుంచి గోల్డ్ మెడల్ తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఆ చాన్స్ కల్పించినందుకు సరోజా మేడమ్‌కు థ్యాంక్స్.
– ఎల్. శ్వేత, ఎల్ఎల్బీ (2020–-23 బ్యాచ్ టాపర్)
ఫ్యామిలీ అంతా సెటిల్ అయ్యాం
కాకా స్థాపించిన విద్యాసంస్థలో చదువుకొని జాబ్ పొంది హెచ్ఎంగా రిటైర్ అయ్యాను. ఈరోజు ఇనిస్టిట్యూషన్‌కు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడే చదువుకునే జాబ్ సాధించా. కుటుంబమంతా మంచిగా సెటిల్ అయ్యాం. ఇందుకు కాకా కృషినే కారణం. అంబేద్కర్ విద్యాసంస్థలకు పేద విద్యార్థులు రుణపడి ఉంటారు. చాలా ఏళ్ల తర్వాత బ్యాచ్‌మెట్స్ అందరం కలిశాం.
– అమరావతి, పూర్వ విద్యార్థి (1977-79 )
కాకా ఆశయాల కొనసాగింపు అభినందనీయం
ఆ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తక్కువగా ఉండేవి. గడ్డం వెంకటస్వామి స్థాపించిన కాలేజీకిలో మంచిగా చదువుకోవడంతోనే ఉన్నతంగా ఎదిగాం. అప్పట్లో ఈ ప్రాంతాన్ని చింతలతోట అనేవారు. పేదలకు చదువు పంచాలనే కాకా ఆశయాన్ని.. నేడు ఆయన కుటుంబ సభ్యులు కొనసాగించడం అభినందనీయం. ఎన్నో ఏళ్ల తర్వాత బ్యాచ్‌మెట్స్ అంతా కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆ పెద్దాయన చలువతోనే ఉన్నతస్థాయికి ఎదిగా. ఆనాటి గుర్తులు కళ్ల ముందు కదులుతున్నాయి.
– సీహెచ్ నరసింహాచారి, బీకాం పూర్వ విద్యార్థి (1975 – 78), మహబూబ్ నగర్
చదువుకునే వాళ్లు అప్పట్లో తక్కువగా ఉండేవారు
కాకా స్థాపించిన విద్యాసంస్థల్లో చదువుకోవడమే ఈరోజు గుర్తింపు రావడానికి కారణం. పేద విద్యార్థుల చదువుకు కాకా కుటుంబం చేస్తున్న కృషి మర్చిపోలేనిది. చాలా సంతోషంగా ఉంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్యమంత్రి రావడం, మమ్మల్ని ఆహ్వానించడం ఊహించలేకపోయాం. ఈరోజు క్లాస్‌మెట్స్ అందరం కలుసుకున్నాం. ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాం. కుటుంబాల యోగక్షేమాలు తెలుసుకున్నాం. కాకా ఇనిస్టిట్యూషన్స్ చక్కటి వేదిక ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది.
– సూర్య పద్మాకర్, బీకాం ఫస్ట్ బ్యాచ్, పూర్వ విద్యార్థి (1974- 77), హైదరాబాద్