
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో ఒకరు..
- ఖమ్మం జిల్లా పెనుబల్లిలో మరొకరు ఆత్మహత్య
కొత్తగూడ (గంగారం)/పెనుబల్లి, వెలుగు : అప్పుల బాధ తట్టుకోలేక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన మోటపోతుల సతీశ్ (40) వ్యవసాయంతో పాటు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తనకున్న ఏడు ఎకరాల్లో మొక్కజొన్న వేశాడు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా మొక్కలు సరిగా మొలకెత్తలేదు. మరో వైపు ఆటో సరిగా నడవకపోవడంతో నెల నెలా ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడేవాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన సతీశ్ గురువారం మధ్యాహ్నం తన చేను వద్దే పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు ములుగు ఏరియా హాస్పిటల్‌కు, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.
రైతు ప్రాణం తీసిన పొగాకు సాగు
పెనుబల్లి, వెలుగు : సాగుకు వాతావరణం అనుకూలించకపోవడం, రేటు లేకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఓ పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్థసారధిపురం గ్రామానికి చెందిన ఎట్టి వీరస్వామి (37) తనకున్న నాలుగు ఎకరాల పోడు భూమిలో రెండేండ్లుగా పొగాకు సాగు చేస్తున్నాడు.
ఓ వైపు వాతావరణం అనుకూలించకపోవడం, మరో వైపు రేటు లేకపోవడంతో సుమారు రూ. 12 లక్షల వరకు అప్పులు అయ్యాయి. దీంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. మనస్తాపానికి గురైన వీరస్వామి నాలుగు రోజుల కింద ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
కుటుంబ సభ్యులు బంధువుల ఇండ్లలో వెదికినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోకి గ్రామస్తులు వెళ్లగా.. చెట్టుకు వేలాడుతూ డెడ్‌బాడీ కనిపించింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు, వీరస్వామి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని చనిపోయింది వీరస్వామే అని నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వీఎం బంజరు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.