
- పాస్‌బుక్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్‌పై కేసు
మంచిర్యాల/బెల్లంపల్లి, వెలుగు : చనిపోయిన కార్మికుల ఫ్యామిలీలకు మంజూరైన ఎక్స్‌గ్రేషియా చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టారు. డబ్బులు తీసుకుంటున్న కాగజ్‌నగర్ ఏఎల్‌వో కాట రామ్మోహన్, బెల్లంపల్లి ఏఎల్‌వో సుకన్యను ఏసీబీ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం...
మంచిర్యాల అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కాట రామ్మోహన్ కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఏఎల్‌వోగా కూడా కొనసాగుతున్నారు. ఆ డివిజన్‌కు చెందిన ఓ భవన నిర్మాణ కార్మికుడు బిల్డింగ్ పైనుంచి పడి చనిపోయాడు. అతడికి యాక్సిడెంటల్ బెనిఫిట్ కింద రూ. 6 లక్షలు మంజూరయ్యాయి. ఈ డబ్బుల కోసం కార్మికుడి కుటుంబ సభ్యులు ఎఎల్‌వో రామ్మోహన్ కలువగా.. రూ. లక్షన్నర ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం రామ్మోహన్ మంచిర్యాలలోని తన ఇంట్లో రూ.50 వేలు తీసుకుంటుండగా.. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రూ. 30 వేలు తీసుకుంటూ...
చనిపోయిన కార్మికుడి ఫ్యామిలీకి ప్రభుత్వం నుంచి మంజూరైన ఆర్థికసాయాన్ని రిలీజ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ లేడీ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడింది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... బెల్లంపల్లికి చెందిన కార్మికుడు నరాల శంకర్ ఇటీవల చనిపోవడంతో అతడి భార్యకు ప్రభుత్వం నుంచి రూ.1.30 లక్షల ఆర్థికసాయం మంజూరైంది. ఈ డబ్బులను రిలీజ్ చేయాలని శంకర్ భార్య బెల్లంపల్లిలోని లేబర్ ఆఫీస్‌లో ఏఎల్‌వో సుకన్యను కలిసింది.
రూ. 40 వేలు ఇస్తేనే పని పూర్తవుతుందని సుకన్య స్పష్టం చేయడంతో శంకర్ భార్య ఏసీబీకి ఫిర్యాదు చేసింది. వారు సూచనలతో శుక్రవారం బెల్లంపల్లి సింగరేణి నంబర్ 2 సమీపంలో ఏఎల్‌వో సుకన్యను కలిసి రూ. 30 వేలు ఇచ్చింది. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఏఎల్‌వో సుకన్యతో పాటు ఆఫీస్ అటెండర్ రాజేశ్వరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఇద్దరినీ శనివారం కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. దాడుల్లో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ఎన్.కిరణ్‌రెడ్డి, ఎస్.రాజు, ఎ. తిరుపతి పాల్గొన్నారు.
రూ. 2 లక్షలు డిమాండ్.. డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ కేసు
ములుగు, వెలుగు : పట్టాదార్ పాస్‌బుక్ మంజూరు చేసేందుకు రూ. 2 లక్షలు డిమాండ్ చేసిన సిద్దిపేట జిల్లా ములుగు డిప్యూటీ తహసీల్దార్ భవానిపై ఏసీబీ ఆఫీసర్లు కేసు నమోదు చేశారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం...
ములుగు మండలం సింగన్నగూడ గ్రామానికి చెందిన ఒక రైతు పట్టాదార్ పాస్‌బుక్ కోసం డిప్యూటీ తహసీల్దార్ భవానీని కలిశాడు. ఇందుకు రూ. 2 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. దీంతో సదరు రైతు ఏప్రిల్ 24న ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు డిప్యూటీ తహసీల్దార్‌తో మాట్లాడిన ఆడియో రికార్డులను అందజేశారు.
శుక్రవారం ఏసీబీ ఆఫీసర్లు ములుగు తహసీల్దార్ ఆఫీస్‌కు ఎంక్వైరీ చేపట్టారు. పాస్‌బుక్ కోసం లంచం డిమాండ్ చేసింది నిజమేనని తేలడంతో డిప్యూటీ తహసీల్దార్ భవానీపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.