
- భయాందోళనలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలవాసులు
కామారెడ్డి, వెలుగు : ఓ వైపు పెద్దపులి.. మరో వైపు చిరుతపులి.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆరు రోజుల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల ఆవులపై పులులు దాడులు చేయడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రామారెడ్డి మండలం స్కూల్ తండా ఏరియాలోని ఫారెస్ట్‌లో ఆరు రోజుల కింద ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసింది.
స్థానికుల సమాచారం మేరకు ఫారెస్ట్ ఆఫీసర్లు పులి కోసం గాలింపు మొదలుపెట్టారు. ట్రాక్ కెమెరాలు, డ్రోన్లతో గాలించినా పులి ఆచూకీ దొరకలేదు. తాజాగా గురువారం రాత్రి రామారెడ్డి మండలంలోని గోకుల్‌తండా సమీపంలోని అడవిలో ఓ చిరుతపులి ఆవుపై దాడి చేసింది. ఇక్కడి ట్రాక్ కెమెరాల్లో చిరుతపులి దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో ఆయా ఏరియాల్లోని గ్రామాలు, తండాలవాసులను ఫారెస్ట్ ఆఫీసర్లు అలర్ట్ చేశారు. అడవిలోకి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా వెళ్లొద్దని
సూచించారు.
పులి జాడ కోసం గాలిస్తున్నాం : ఫారెస్ట్ స్టేట్ చీఫ్ కన్జర్వేటర్ ఏలుసింగ్ మేరు
కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించామని, దాని జాడ కోసం గాలిస్తున్నామని ఫారెస్ట్ స్టేట్ చీఫ్ కన్జర్వేటర్ ఏలుసింగ్ మేరు పేర్కొన్నారు. రామారెడ్డి మండలంలో ఇటీవల ఆవుపై పెద్ద పులి దాడి చేసిన ప్రాంతాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు.
స్థానిక ఆఫీసర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పులి జాడ కోసం ఐదు రోజులుగా ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారన్నారు. ఆయన వెంట జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నిఖిత, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి ఉన్నారు.