
- రాష్ట్రవ్యాప్తంగా 77,561 మందికి అలాట్‌మెంట్
- అత్యధికంగా సీఎస్‌ఈలో 57,042 సీట్లు నిండినయ్
- 82 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ
- విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేసేందుకు ఈ నెల 22 వరకు చాన్స్
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో బీటెక్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్‌మెంట్ ప్రక్రియ పూర్తయింది. టీజీ ఎప్ సెట్ తొలి విడత సీట్ల కేటాయింపులోనే 93.3 శాతం భర్తీ అయ్యాయి. ఈ వివరాలను శుక్రవారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 172 ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిలో 83,054 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. 95,256 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాగా, వారిలో 94,354 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వాళ్లంతా 59,31,279 వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు శుక్రవారం సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. మొత్తం 83,054 సీట్లకు గాను 77,561 మందికి సీట్లు అలాట్ చేశారు. వీరిలో 6,083 మందికి ఈడబ్ల్యూఎస్ కోటాలో సీట్లు కేటాయించారు. మరో 5,493 సీట్లు ఖాళీగా ఉన్నాయి. తక్కువ ఆప్షన్లు ఇచ్చిన 16,793 మందికి సీట్లు కేటాయించలేదు. మొత్తం 82 కాలేజీల్లో వందశాతం సీట్లు నిండగా.. వాటిల్లో ఆరు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. సీట్లు వచ్చిన విద్యార్థులు ఈ నెల 22లోగా tgeapcet.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. కాగా, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా సీట్లను తర్వాత కేటాయించనున్నారు.
సీఎస్‌ఈకి ఫుల్ డిమాండ్..
సీఎస్‌ఈ, దాని అనుబంధ బ్రాంచ్‌లకు ఫుల్ డిమాండ్ నెలకొన్నది. ఆయా కోర్సుల్లో 58,742 సీట్లు ఉండగా.. 57,042 సీట్లు అలాట్ అయ్యాయి. కేవలం 1,700 సీట్లు మాత్రమే మిగిలాయి. మొత్తం 17 బ్రాంచులకు గాను ఆరు బ్రాంచుల్లో వందశాతం సీట్లు నిండాయి. రెండు, మూడు బ్రాంచులు మినహా మిగిలిన అన్నీ కూడా 90 శాతానికి పైగా సీట్లు నిండాయి. ట్రిపుల్ ఈ, దాని అనుబంధ బ్రాంచుల్లో 16,112 సీట్లు ఉంటే 14,054 (87.23%) సీట్లు నిండాయి. సివిల్, మెకానికల్ తదితర బ్రాంచుల్లో 7,100 సీట్లు ఉంటే 5,632 (79.32%) నిండాయి. ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లో 1,100 సీట్లుంటే 833 విద్యార్థులకు కేటాయించారు.
మాక్ అలాట్మెంట్ సక్సెస్..
రాష్ట్రంలో తొలిసారిగా మాక్ సీట్ల అలాట్మెంట్ విధానం తీసుకొచ్చారు. ఈ నెల 12న 77,154 మందికి సీట్లు కేటాయించారు. ఆ తర్వాత రెండ్రోజుల పాటు వెబ్ ఆప్షన్ల మార్పునకు చాన్స్ ఇవ్వగా.. 44,553 మంది ఆప్షన్లు మార్చుకున్నారు.దీంతో 36,544 మందికి మాక్ అలకేషన్‌లో వచ్చిన కాలేజీలు, బ్రాంచులు మారాయి. ఇది విద్యార్థులకు ఉపయోగకరంగా మారింది.
ఇంజనీరింగ్ సీట్ల వివరాలివీ...
సంస్థ కాలేజీలు సీట్లు భర్తీ ఖాళీ భర్తీ శాతం
గవర్నమెంట్ కాలేజీలు 01 (కోస్గి) 195 94 101 48.2
ప్రభుత్వ వర్సిటీలు 20 6,108 5,151 957 84.3
ప్రైవేటు వర్సిటీలు 2 1,367 1,357 10 99.2
ప్రైవేటు కాలేజీలు 149 75,384 70,959 4,425 94.1