
చేవెళ్ల, వెలుగు: ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చేవెళ్ల ప్రభుత్వ ఏరియా దవాఖానాలో రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.10 లక్షల బీమా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను ప్రారంభించారు. సమావేశంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీవో సాయిరాం, ఎంపీపీ విజయలక్ష్మీ,షాబాద్ ఎంపీపీ అవినాష్‌రెడ్డి, చేవెళ్ల సర్పంచ్శైలజ అగిరెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ దామోదర్, తహసీల్దార్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆదివారం మహాలక్ష్మి పథకం ప్రారంభ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య అధికార పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపట్టిన పథకాలపై ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. అధికార పార్టీ నాయకులు ప్రస్తుత పథకాలపై మాట్లాడాలని అనడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీ పామెన భీమ్ భరత్, ఎమ్మెల్యే యాదయ్య వర్గీయుల మధ్య మాటల యుద్ధం నడిచింది. పోలీసులు కలగజేసుకుని గొడవను ఆపారు. గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు సరైన వైద్యం అందలేదని పామెన భీమ్ భరత్ ఆరోపించారు. కొవిడ్ సమయంలో వైద్యాధికారులు సేవ చేశారే తప్ప ప్రభుత్వం సరైన విధంగా ఆదుకోలేదని విమర్శించారు.