
- తప్పుగా ఫైల్ చేస్తే మాకు తెలుస్తుంది
- ఎవరేది చెప్పినా పక్కాగా రికార్డ్ చేస్తం
- కొందరు ఆఫీసర్లు ఔట్ ఆఫ్ స్టేషన్
- వాళ్లను కూడా విచారించాల్సి ఉంది
- అప్పటి సర్కార్ డెడ్ లైన్ పెట్టిందట
- అందుకే వేగంగా పనులు చేశామని ఏజెన్సీల ప్రతినిధులు చెప్పారు
- ఆదేశాలు ఇచ్చిన వాళ్లనూ పిలుస్తాం
- కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్
హైదరాబాద్: బ్యారేజీల నిర్మాణం, డిజైన్ కు సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తున్నామని బాధ్యులైన వారెవరినీ వదలబోమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. ఇవాళ జలసౌధలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇవాళ ఏజెన్సీలో సమావేశమయ్యామని, వాళ్లు చెప్పిన అన్ని అంశాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు.
గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొనేందుకే అఫిడవిట్ ఫైల్ చేయాలని చెబుతున్నామని వివరించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని గత సర్కారు తమపై ఒత్తిడి పెట్టిందని, డెడ్ లైన్ విధించిందని, అందుకే వేగంగా పనులు పూర్తి చేశామని ఏజెన్సీల ప్రతినిధులు వెల్లడించారని అన్నారు. బ్యారేజీల నిర్మాణం, డిజైన్, నిర్వహణకు సంబ్దంధించిన అన్ని వివరాలను ఇవ్వాలని ఆదేశించామని అన్నారు. ఎవరు ఏది చెప్పినా పక్కాగా రికార్డులను మెయింటెయిన్ చేస్తున్నామని, అన్నింటినీ రికార్డుల రూపంలో ఉంచుతున్నామని చెప్పారు.
ఈ నెలాఖరు నాటికి అఫిడవిట్ ఇవ్వాలని నిర్మాణ సంస్థలను ఆదేశించామని చెప్పారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు ఆదరాబాదరాగా జరిగాయన్నది రికార్డుల రూపంలో సమాధానం వచ్చాకే ఆ బాధ్యులను కూడా విచారణకు పిలుస్తామని చెప్పారు. ఆధారాల కోసమే అఫిడవిట్ అడుగుతున్నామని అన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో భాగస్వాములైన కొందరు అధికారులు రాష్ట్రంలో లేరని, వాళ్లు ఔట్ ఆఫ్ స్టేషన్ అని చెబుతున్నారని, వాళ్లను కూడా విచారించాల్సి ఉందని ఘోష్ తెలిపారు. కాగ్, విజిలెన్స్ రిపోర్టులు అందాయని, వాటిని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. వాళ్లను కూడా విచారిస్తామని అన్నారు. ఎవరైనా తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే తమకు తెలిసిపోతుందని, వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు.