కాళేశ్వరం లొకేషన్లు మార్చి అంచనాలు పెంచి..ఎక్స్ పర్ట్స్ కమిటీ సిఫార్సులను తొక్కిపెట్టిన కేసీఆర్

కాళేశ్వరం లొకేషన్లు మార్చి అంచనాలు పెంచి..ఎక్స్ పర్ట్స్ కమిటీ సిఫార్సులను తొక్కిపెట్టిన కేసీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నుంచి.. కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్నీ కేసీఆర్​ కనుసన్నల్లోనే నడిచాయని కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ తేల్చింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని పేర్కొంది. కేబినెట్​లో చర్చించకుండానే.. సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని తెలిపింది. డీపీఆర్​ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని ఆక్షేపించింది. బ్యారేజీ సైట్​ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. 

బ్యారేజీల లొకేషన్లను ఉద్దేశపూర్వకంగానే మార్చారని, ఆ నిర్ణయమూ నాటి సీఎం కేసీఆర్​దేనని జ్యుడీషియల్​ కమిషన్​ నివేదిక తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 2016 జులై, ఆగస్టులో ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొంది. అయితే, వ్యాప్కోస్​తో అధ్యయనాలు చేయించకుండానే అదే ఏడాది అక్టోబర్​లో హైపవర్​ కమిటీ మీటింగ్​ను నిర్వహించారని, బ్యారేజీల సైట్​లను మార్చి నిర్మాణాలు చేపట్టాలనికేసీఆర్​, హరీశ్​ రావు  ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తేల్చిచెప్పింది. దీనికి ప్రభుత్వ (కేబినెట్​) ఆమోదం కూడా లేదని స్పష్టం చేసింది. అప్పట్లో నిపుణులు ఇచ్చిన రిపోర్టులను తొక్కిపెట్టారని తీవ్రంగా ఆక్షేపించింది. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని ఓ సాకును చూపించి మేడిగడ్డకు లొకేషన్​ను మార్చారని పేర్కొంది. ఆ నిర్ణయంలో ఎక్కడా నిజాయితీ లేదని తెలిపింది. ‘‘2015 జనవరి 21న ప్రభుత్వం ఎక్స్​పర్ట్​ కమిటీని ఏర్పాటు చేసింది. 

మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఫీజిబుల్​ కాదని ఆ కమిటీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అక్కడ కడితే ఎక్కువ సమయం పట్టడంతో పాటు ఖర్చు ఎక్కువ అవుతుందని ప్రభుత్వానికి సూచించింది. దానికి బదులు వేమనపల్లి వద్ద బ్యారేజీని నిర్మిస్తే బాగుంటుందని ఎక్స్​పర్ట్​ కమిటీ సిఫార్సు చేసింది. కానీ, ఆ రిపోర్టును అప్పటి సీఎం కేసీఆర్​ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెట్టారు. కనీసం అందులోని సిఫార్సులను పట్టించుకోలేదు. కోల్డ్​ స్టోరేజీకి దానిని పరిమితం చేశారు’’ అని రిపోర్ట్​ తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణానికి 2016 మార్చి 1న జీవోలు 231, 232, 233 ఇచ్చారని.. కానీ, వాటిని కేబినెట్​ ముందు పెట్టలేదని, బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్​ ఆమోదమూ లేదని స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వ బిజినెస్​ రూల్స్​కు విరుద్ధమని కమిషన్​ తన నివేదికలో ఆక్షేపించింది. 

డీపీఆర్​కు ముందే ప్రధానికి లేఖ

కాళేశ్వరం ప్రాజెక్ట్​కు సంబంధించి వ్యాప్కోస్​ సంస్థ డిటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్టు (డీపీఆర్​)ను సమర్పించడానికి ముందే ప్రాజెక్టు ఖర్చుపై 2016 ఫిబ్రవరి 11న ప్రధానికి నాటి సీఎం కేసీఆర్​ లేఖ రాశారని జ్యుడీషియల్​ కమిషన్​ నిగ్గు తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 71,436 కోట్లు ఖర్చవుతుందని ప్రధానికి రాసిన ఆ లేఖలో పేర్కొన్నారని స్పష్టం చేసింది. వాస్తవానికి ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పొంతన లేకుండా పెంచేశారని తెలిపింది. తొలుత ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,500 కోట్లుగా ఉండగా.. నాటి సీఎం కేసీఆర్​ లేఖ ప్రకారం 2016 నాటికి దానిని రూ.71,436 కోట్లకు పెంచారని స్పష్టం చేసింది. ఆ వ్యయం కాస్తా..  2022 మార్చి నాటికి రూ.1,10,248 కోట్లకు పెంచుతూ పరిపాలనా అనుమతులు ఇచ్చారని స్పష్టంచేసింది. 

నీళ్లు నింపాలన్నదీ కేసీఆరే..

బ్యారేజీల్లో నీళ్లు నింపాలని ఆదేశాలిచ్చింది కూడా అప్పటి సీఎం కేసీఆరేనని కమిషన్​ నివేదిక తేల్చిచెప్పింది. బ్యారేజీలను నీటిని మళ్లించేందుకే వాడాల్సి ఉన్నా.. నీటిని పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నింపారని స్పష్టం చేసింది. ఇలా నీళ్లను నింపడంతోనే బ్యారేజీలకు పెను ప్రమాదం ఏర్పడిందని తేల్చింది. బ్యారేజీలను నిర్మించినప్పటి నుంచీ ఆపరేషన్స్​ అండ్​ మెయింటెనెన్స్​ (ఓ అండ్​ ఎం)ను చేపట్టలేదని, పూర్తి నిర్లక్ష్యం చేశారని కమిషన్​ నివేదిక తేల్చింది. కాలానుగుణంగా పరీక్షలు చేయలేదని, వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత చేయాల్సిన ఇన్​స్పెక్షన్లు చేయలేదని, నివేదికలు ఇవ్వలేదని పేర్కొంది. 

వాస్తవానికి బ్యారేజీలను ఫ్లోటింగ్​ స్ట్రక్చర్లుగా (తేలియాడే నిర్మాణం) డిజైన్​ చేసినప్పటికీ.. నీటిని స్టోర్​ చేసే వాటిగా కట్టారని, అది ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను మార్చాక అక్కడ బ్యాక్ వాటర్​ స్టడీస్​, టెయిల్​ వాటర్​ రేటింగ్​ కర్వ్స్​, జీడీ కర్వ్స్​, జియోఫిజికల్​ ఇన్వెస్టిగేషన్స్​ను చేయలేదని తెలిపింది. నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని స్పష్టం చేసింది. సీకెంట్​ పైల్స్​ వంటి నిర్మాణాలను చేపట్టేటప్పుడు నాణ్యతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాల్సి ఉన్నా.. పట్టింపులేనట్టుగానే వ్యవహరించినట్టు ఉందని తెలిపింది. సరైన కొలతలు లేకుండానే వర్చువల్​గానే వాటి నిర్మాణాన్ని ఓకే చేశారని తెలిపింది. 

కుమ్మక్కయ్యారు..

ప్రాజెక్ట్​ నిర్మాణంలో ఏజెన్సీతో అధికారులు కుమ్మక్కయ్యారని కమిషన్​ నివేదిక తేల్చింది. దురుద్దేశపూర్వకంగా వ్యవహరించి దాని నుంచి లబ్ధి పొందాలని చూశారని వెల్లడించింది. ప్రాజెక్టు కోసం భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని పేర్కొంది. బ్యారేజీలకు వ్యాప్కోస్​ సంస్థతో స్టడీ చేయించినా.. ఆ నివేదికనూ పక్కన పడేశారని కమిషన్​ తెలిపింది. అందుకు సంస్థకు చెల్లించిన రూ.6.77 కోట్లను సంబంధిత అధికారుల నుంచి వసూలు చేయాలని సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఏడో బ్లాక్​ కుంగుబాటులో ఏజెన్సీ ఎల్​ అండ్​ టీ పాత్ర కూడా ఉందని స్పష్టం చేసింది. ఏడో బ్లాక్​ పునరుద్ధరణను ఎల్​ అండ్​ టీ ఖర్చులతోనే చేయించాలని సిఫార్సు చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో డిఫెక్ట్​ లయబిలిటీ పీరియడ్​లోనే సమస్యలు వచ్చినందున.. ఆయా సంస్థలతోనే రిపేర్లు చేయించాలని సూచించింది.