
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నుంచి.. కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్నీ కేసీఆర్ కనుసన్నల్లోనే నడిచాయని కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ తేల్చింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని పేర్కొంది. కేబినెట్లో చర్చించకుండానే.. సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని తెలిపింది. డీపీఆర్ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని ఆక్షేపించింది. బ్యారేజీ సైట్‌ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడంపైనా ఆయనే నిర్ణయం తీసుకున్నారని తేల్చిచెప్పింది. కేసీఆర్ నిర్ణయాలే చివరికి బ్యారేజీల ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అసలు దోషి ఆయనేనని కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది.
నీళ్లు నింపాలన్నదీ కేసీఆరే..
బ్యారేజీల్లో నీళ్లు నింపాలని ఆదేశాలిచ్చింది కూడా అప్పటి సీఎం కేసీఆరేనని కమిషన్ నివేదిక తేల్చిచెప్పింది. బ్యారేజీలను నీటిని మళ్లించేందుకే వాడాల్సి ఉన్నా.. నీటిని పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నింపారని స్పష్టం చేసింది. ఇలా నీళ్లను నింపడంతోనే బ్యారేజీలకు పెను ప్రమాదం ఏర్పడిందని తేల్చింది. బ్యారేజీలను నిర్మించినప్పటి నుంచీ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం)ను చేపట్టలేదని, పూర్తి నిర్లక్ష్యం చేశారని కమిషన్ నివేదిక తేల్చింది.
►ALSO READ | కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రకారం వీళ్లంతా బాధ్యులే..
కాలానుగుణంగా పరీక్షలు చేయలేదని, వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత చేయాల్సిన ఇన్స్పెక్షన్లు చేయలేదని, నివేదికలు ఇవ్వలేదని పేర్కొంది. వాస్తవానికి బ్యారేజీలను ఫ్లోటింగ్ స్ట్రక్చర్లుగా (తేలియాడే నిర్మాణం) డిజైన్ చేసినప్పటికీ.. నీటిని స్టోర్ చేసే వాటిగా కట్టారని, అది ప్రమాణాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్లను మార్చాక అక్కడ బ్యాక్ వాటర్ స్టడీస్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్స్, జీడీ కర్వ్స్, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్‌ను చేయలేదని తెలిపింది. నాణ్యతా ప్రమాణాలను పాటించలేదని స్పష్టం చేసింది. సీకెంట్ పైల్స్ వంటి నిర్మాణాలను చేపట్టేటప్పుడు నాణ్యతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాల్సి ఉన్నా.. పట్టింపులేనట్టుగానే వ్యవహరించినట్టు ఉందని తెలిపింది. సరైన కొలతలు లేకుండానే వర్చువల్‌గానే వాటి నిర్మాణాన్ని ఓకే చేశారని తెలిపింది.