కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రకారం వీళ్లంతా బాధ్యులే..

కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రకారం వీళ్లంతా బాధ్యులే..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం నుంచి.. కాంట్రాక్టుల అప్పగింత, అంచనాల సవరణ, బిల్లుల చెల్లింపు సహా అన్నీ కేసీఆర్​ కనుసన్నల్లోనే నడిచాయని కాళేశ్వరం జ్యుడీషియల్​ కమిషన్​ తేల్చింది. ప్రాజెక్టులో ప్రతి చిన్న పనిలోనూ ఆయన జోక్యం చేసుకున్నారని పేర్కొంది. కేబినెట్​లో చర్చించకుండానే.. సరైన ఫైళ్లు లేకుండానే ప్రాజెక్టు పనులను చేయించారని తెలిపింది. డీపీఆర్​ సిద్ధం కాకముందే ప్రాజెక్టు ఖర్చుపై ప్రధానికి లేఖ రాశారని, విచ్చలవిడిగా అంచనాలను పెంచేశారని ఆక్షేపించింది. బ్యారేజీ సైట్​ను ఉద్దేశపూర్వకంగానే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేందుకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. 

బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడంపైనా ఆయనే నిర్ణయం తీసుకున్నారని తేల్చిచెప్పింది. కేసీఆర్​ నిర్ణయాలే చివరికి బ్యారేజీల ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయని, ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అసలు దోషి ఆయనేనని కమిషన్​ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు వైఫల్యాలకు నాటి ఇరిగేషన్​ శాఖ మంత్రి హరీశ్​రావు, నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్​  కూడా బాధ్యులేనని తేల్చిచెప్పింది. ఆర్థికాంశాల్లో అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఈటల రాజేందర్​ బాధ్యతగా వ్యవహరించలేదని తెలిపింది. అప్పటి ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్​ అధికారులు ఎస్కే జోషి, స్మితా సబర్వాల్​ పనితీరునూ తప్పుబట్టింది. కాంట్రాక్ట్​ దక్కించుకున్న సంస్థలు ఎల్​ అండ్​టీ, ఆఫ్కాన్స్​, నవయుగ సంస్థలూ బ్యారేజీలు విఫలమవడంలో ప్రధాన కారణమని కమిషన్​ తేల్చి చెప్పింది. 

కమిషన్​ నివేదిక ప్రకారం వీళ్లంతా బాధ్యులే..

కేసీఆర్: ప్రాజెక్టులోని మూడు బ్యారేజీల ప్లానింగ్​, నిర్మాణం, కంప్లీషన్​, ఓ అండ్​ ఎంలలో అవకతవకలు, అక్రమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా అప్పటి సీఎం కేసీఆరే బాధ్యుడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాల వల్లే మూడు బ్యారేజీలకు ఇప్పుడీ దుస్థితి ఏర్పడింది. 

హరీశ్​ రావు: అప్పటి సీఎం కేసీఆర్​తో పాటు అప్పటి ఇరిగేషన్​ మంత్రి హరీశ్​ రావు కూడా ఉద్దేశపూర్వకంగానే ఎక్స్​పర్ట్​ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. 

ఈటల రాజేందర్​: కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్​పై ఉన్నా.. ఆయనలో ఆ కమిట్​మెంట్​ లోపించింది. ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక నిర్ణయాలపై సరిగ్గా దృష్టి సారించలేదు. కాళేశ్వరం కార్పొరేషన్​ బోర్డులో ఆర్థిక శాఖ కూడా భాగమైనా అది తమ బాధ్యత కాదని తప్పించుకున్నారు. 

ఎస్కే జోషి: అప్పట్లో ఇరిగేషన్​ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సీఎస్​గా  ఉన్న ఈయన ఎక్స్​పర్ట్​ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. పరిపాలనకు సంబంధించి బిజినెస్​ రూల్స్​ను ఉల్లంఘించారు. కాళేశ్వరం కార్పొరేషన్​ ఫెయిల్యూర్​కు బాధ్యుడు. 

స్మితా సబర్వాల్​: అప్పటి సీఎంవో సెక్రటరీగా స్మితా సబర్వాల్​ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదు. కేబినెట్​ అనుమతులకు సంబంధించి బిజినెస్​ రూల్స్​ ప్రకారం నడుచుకోలేదు. 

మురళీధర్​రావు: ఈఎన్సీగా విధుల్లో ఉన్న ఈయన సెంట్రల్​ వాటర్​ కమిషన్​కు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎక్స్​పర్ట్​ కమిటీ నివేదికను దాచేశారు. దురుద్దేశపూర్వకంగా అంచనాలను పెంచారు. ఓ అండ్​ఎంలో ఫెయిలయ్యారు. 

బి.హరిరాం: ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు సీఈగా సీడబ్ల్యూసీకి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎక్స్​పర్ట్స్​ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్​ ఎండీ అయి ఉండి కూడా బ్యారేజీల సంగతి తనకు తెలియదంటూ చెప్పారు. 
   
బ్యారేజీల నిర్మాణంలో కాళేశ్వరం సీఈ ఎన్​. వెంకటేశ్వర్లు, రామగుండం సీఈ కొట్టె సుధాకర్​ రెడ్డి, ఈఈ ఓంకార్​ సింగ్​, ఇతర అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. 

 బి. నాగేందర్​ రావు: అప్పట్లో ఈఎన్​సీ  (ఓ అండ్​ ఎం)గా ఉన్న ఈయన  2021 జనవరి 1 నుంచి బ్యారేజీల ఓ అండ్​ ఎంను పట్టించుకోవడంలో విఫలమయ్యారు. బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి ఇతరులపైకి నెపాన్ని మోపే ప్రయత్నం చేశారు. మూడు బ్యారేజీలు డ్యామేజ్​ అవ్వడానికి కారణమయ్యారు. 

టి. ప్రమీల: స్టేట్​ డ్యామ్​ సేఫ్టీ ఆర్గనైజేషన్​ సీఈగా ఆమె తన విధులను నిర్లక్ష్యం చేశారు. బ్యారేజీలను ఎప్పటికప్పుడు ఇన్​స్పెక్షన్​, డ్యామ్​ సేఫ్టీ డ్యూటీలు చేయడంలో విఫలమయ్యారు. డ్యామ్​ సేఫ్టీ యాక్ట్​ ప్రకారం పనిచేయలేదు. 

 నరేందర్​ రెడ్డి (సీఈ సీడీవో), కేఎస్​ఎస్​ చంద్రశేఖర్​ (ఎస్​ఈ సీడీవో), బసవరాజు (ఈఈ సీడీవో), టి. శ్రీనివాస్​ (సీఈ)లు కమిషన్​ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. నిజాలు దాచారు. వీరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.  

శ్రీదేవి (సీఈ ఈఆర్​ఎల్​): ప్రమాణాలకు తగ్గట్టు మోడల్​ స్టడీస్​ నిర్వహించలేదు. 

అనిల్​ కుమార్​: అప్పట్లో ఈఎన్సీగా పనిచేసిన ఈయన.. ఆదేశాలను కాదని తన సొంత నిర్ణయాలు తీసుకున్నారు.