కారకులను తేలుస్తున్న కాళేశ్వరం దర్యాప్తు

కారకులను తేలుస్తున్న కాళేశ్వరం దర్యాప్తు

ప్రజల్ని కట్టిపడేసే మాయను బీఆర్ఎస్ నాయకులు అభ్యసించినంతగా మరెవరూ అభ్యసించలేదు.  నకిలీ అద్భుతాన్ని చూపించి నిజాన్ని మరిచిపోయేలా చేయడం,  ప్రజలకు అవసరంలేని దానిని కావాలని అనిపించేలా చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య.  వీరు చూపించే అద్భుతాలను చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తారు. కళ్ళకు కనిపించేదే హృదయాలకు సూటిగా తగులుతుంది అని రాజకీయ తత్వవేత్త మాకియవెలి అన్నాడు.

కాళేశ్వరం కూలిన పాపం ముమ్మాటికీ బీఆర్ఎస్ పాలకులదే.  ఇంజినీరింగ్ వైఫల్యానికి ఇదో పరాకాష్ట.  బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టు వారి హయాంలోనే  కూలిపోయింది. మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజిల నిర్మాణాలు  పూర్తిగా  కూలిపోయాయని ఎన్డీఎస్ఏ  నివేదికలో  స్పష్టం అయింది. కాళేశ్వరం పేరుతో  బీఆర్ఎస్ పాలకులు చేసిన అప్పులు మూడు తరాలకు భారంగా పరిణమించగా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ  అతలాకుతలమైంది. 

నాటి ప్రభుత్వం భారీ వడ్డీలతో చేసిన రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం  ఏటా రూ.16,000 కోట్లు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటు తెలంగాణ రైతాంగానికి మోయలేని భారంగా మారింది.   ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం భద్రతా ప్రమాణాలు పాటించలేదు. 2019 నుంచే నీళ్లు కారడం, పగుళ్లు ఏర్పడడం జరిగినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంతటి విపత్తుకు బాధ్యులైనవారిపై 
చట్టపరంగా చర్యలు తప్పవు. 

కాళేశ్వరం డిజైన్లు ఖరారు చేసిన కేసీఆర్​? ‘కాళేశ్వరం బ్యారేజీల డిజైన్‌లు/డ్రాయింగ్‌లు 

సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్‌, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు మాకు ఇవ్వలేదు. హడావుడిగా డిజైన్లపై సంతకాలు చేయాలని కేసీఆర్‌, హరీశ్‌రావు తొందరపెట్టారు.  ఉన్నతస్థాయిలో జరిగిన ఏ సమీక్షకూ  పిలవలేదు.  పరిశీలించాల్సిన బాధ్యత నాపై ఉన్నా గత ప్రభుత్వం ఆ అవకాశమే ఇవ్వలేదు.   నాటి ముఖ్యమంత్రి కేసీఆర్​ డిజైన్లను ఖరారు చేశారు. 

మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లను సీడీవోతో కలిసి ఎల్‌ అండ్‌ టీ తయారుచేసింది. బ్యారేజీలు 2019 జూన్‌లో ప్రారంభంకాగా.. వాటిని నాలుగేళ్ల పాటు పట్టించుకోలేదు. నాలుగేళ్ల పాటు బ్యారేజీలను వదిలేయడం వల్లే వైఫల్యం చెందాయి’ అని జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ విచారణలో మాజీ ఈఎన్‌సీ, సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) ఎ.నరేందర్‌రెడ్డి వెల్లడించారు. దీనికి మించిన సాక్ష్యం ఇంకేముంటుంది?

భారీగా ప్రజాధనం వృథా

కాళేశ్వరం ప్రాజెక్టును మేం డిజైన్‌ చేయలేదు.  నాకు ఇంజినీరింగ్‌ భాషే రాదు. రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప డిజైన్‌ చేసేవాళ్లం కాదు.  సీఎం అయ్యాక తక్కువ ముంపుతో వరద నీటిని తీసుకొని వాడుకోవాలనే వ్యూహం రచించా అంతే అని కేసీఆర్ 2024 ఏప్రిల్​లో ఒక న్యూస్ చానల్​లో చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ లోపాలు తెలంగాణకు శాపంగా మారాయి. మేడిగడ్డ బ్యారేజీ  కుంగిపోవడం రాష్ట్ర ప్రజలను కుంగుబాటుకు గురి చేసింది. ఆ ప్రాజెక్ట్‌ వైఫల్యం కేవలం కుంగుబాటు సంఘటనతోనే బయటపడలేదు.ఈ వైఫల్యం గురించి అప్పటి సీఎం కేసీఆర్​కు, అధికారులకు ముందే తెలుసని నిపుణులంటున్నారు.

కాళేశ్వరం ఆయకట్టు ఓ కనికట్టు

ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా మేడిగడ్డలాగ ఒకే రకమైన డిజైన్లు, నిర్మాణ పద్ధతులను కలిగి ఉండడంతో అవి కూడా ప్రమాదంలో పడినట్లుగా ఎన్డీఎస్ఏ తెలిపింది. కాళేశ్వరం ఆయ‌క‌ట్టు అంతా క‌నిక‌ట్టేన‌ని 'కాగ్' నివేదిక నిగ్గు తేల్చింది. 18.26 లక్షల ఎక‌రాల కొత్త ఆయ‌క‌ట్టుకు సాగునీరు ఇచ్చేవిధంగా డిజైన్ చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో 2022 మార్చి నాటికి కేవ‌లం 40,888 ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు మాత్రమే నీళ్లు ఇచ్చిన‌ట్లు కాగ్ స్పష్టం చేసింది. 

దీనిని బ‌ట్టి ప‌రిశీలిస్తే కాళేశ్వరంలో ల‌క్ష కోట్ల నిధులు పారాయి కానీ ల‌క్ష ఎక‌రాల‌కు కూడా సాగునీరు అంద‌లేద‌ని స్పష్టం అవుతుంది.  దాదాపు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్   అప్పు రూ.87,369.89 కోట్లకు  ప్రతి ఏటా వ‌డ్డీ, అస‌లు కింద రూ.10 వేల కోట్ల నుంచి 14 వేల కోట్ల వ‌ర‌కు చెల్లించాల్సి ఉంటుంద‌ని కాగ్ తెలిపింది.

అప్పులు తీర్చడం కోసం అప్పులు

ఈ ప్రాజెక్టుకు తెచ్చిన అప్పులు తీర్చడం కోసం ప్రభుత్వం కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. జ‌రిగిన న‌ష్టానికి త‌మ‌కు సంబంధంలేద‌ని 2019లోనే కాంట్రాక్టర్లు ప్రకటించిన  విష‌యాన్ని

కాగ్  బ‌ట్టబ‌య‌లు చేసింది. త‌మ‌కు ఇచ్చిన డిజైన్ల ప్రకారమే తాము ప‌నులు చేశామ‌ని, అలాంట‌ప్పుడు జ‌రిగిన న‌ష్టానికి తామెలా బాధ్యులమ‌వుతామ‌ని   ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఎవరు బాధ్యులు? నిపుణులతో చర్చించకుండా స్థలాన్ని, బ్యారేజీల నిర్మాణాన్ని అప్పటి సీఎం నిర్ణయిస్తే ఇవాళ అధికారులు బాధ్యులుగా మారుతున్నారు. అధికారులను నయానో భయానో, లోబర్చుకునో అశాస్త్రీయంగా కాళేశ్వర నిర్మాణం చేసింది మాత్రం అప్పటి బీఆర్​ఎస్​ పాలకులే.  ఎన్​డీఎస్​ఏ రిపోర్టు కూడా బ్యారేజీల లోపాలను స్పష్టం చేసింది. 

ఇక జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ అప్పటి సీఎంను, బాధ్యులైన అప్పటి ఇరిగేషన్​ మంత్రులను విచారిస్తుందా లేదా చూడాల్సి ఉంది. ఘోష్​ కమిషన్​ పూర్తి రిపోర్టు ప్రభుత్వానికి అందాకే ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై ఓ స్పష్టత రావచ్చు. మొత్తం మీద కాళేశ్వరం మానవ నిర్మిత భారీ విపత్తు అని మాత్రం తేలిపోయింది.

మాకియవెలి సూత్రాన్ని కేసీఆర్,  కేటీఆర్,  హరీశ్​రావు అక్షరాలా పాటిస్తున్నట్టు కనిపిస్తోంది.  ప్రపంచంలోనే అద్భుతమైన మానవ నిర్మిత కట్టడంగా, ఇంజినీరింగ్ అద్భుతంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. తీరా అదంతా డొల్ల అని తేలినపుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆత్మరక్షణలో పడుతుందని కొందరు భావించారు. కానీ,  ఎన్డీఎస్ఏ  నివేదిక రాజకీయ ప్రేరేపితం అని మాజీ మంత్రి హరీశ్​రావు ఆరోపించారు. గతంలో ప్రగతి భవన్, ఇప్పుడు ఎర్రవల్లి ఫాంహౌస్​లో రూపొందితే తప్ప ఏ రిపోర్టునూ బీఆర్ఎస్ నాయకులు అంగీకరించేలా లేరు మరి!

- ఎస్.కే. జకీర్,సీనియర్ జర్నలిస్ట్