
భారీ వరద టైమ్‌లోనూ పనిచేయని మోటార్లు
పైసలన్నీ కాళేశ్వరంలో పోసిన సర్కారు.. కృష్ణా ప్రాజెక్టులపై మాటలతోనే టైంపాస్
90 టీఎంసీలకు ఎత్తిపోసింది 5 టీఎంసీలే.. పాలమూరు రైతులకు చేరాల్సిన నీళ్లన్నీ కిందికే
గోదావరి నీళ్లను మళ్లిస్తామంటూ దానిపైనే దృష్టిపెట్టిన రాష్ట్ర సర్కారు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను గాలికొదిలేసింది. అనుకోని వరంలా పదేండ్ల తర్వాత భారీ వరద వచ్చినా, కావాల్సినన్ని లిఫ్టులు ఉన్నా నీళ్లను మళ్లించడంలో ఘోరంగా ఫెయిలైంది. కృష్ణా బేసిన్ లోని లిఫ్ట్ పథకాల్లో కీలకమైన మోటార్లు, పంపుల నిర్వహణకు నిధులివ్వకుండా విలువైన వరద జలాలను సముద్రంపాలు చేసింది. గొప్పలకు పోయి వేలకోట్ల నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించి, చాలా తక్కువ ఖర్చుతో కృష్ణానీళ్లను వాడుకునే అవకాశాలను చేతులారా వదిలేసింది. దీంతో కృష్ణా నదికి వరద పోటెత్తిన సమయంలో మోటార్లు మొరాయించాయి. లిఫ్టులు ఫెయిలయ్యాయి. అవసరమైన సమయంలోనే వరద నీళ్లను వాడుకోలేని దుస్థితి తలెత్తింది. దీంతో మహబూబ్ నగర్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర సర్కారు నిర్వాకం ఇలాగుంటే.. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ సర్కారు తమకు రావాల్సిన వాటా కంటే మించి నీళ్లను తరలించుకుపోయింది.
చాలా కాలం తర్వాత కృష్ణమ్మ పోటెత్తడం చూసి రాష్ట్రంలో అందరూ సంబురపడ్డారు. రైతుల నీళ్ల కష్టాలు ఈసారైనా తీరుతాయనుకున్నారు. అయితే ఇంత వరద వచ్చినా కృష్ణా బేసిన్ లోని పాలమూరు జిల్లాలో ఒక్క చెరువు సరిగా నిండలేదు. జూరాల నుండి శ్రీశైలం వరకు సర్కారు ప్రాధాన్యంగా చెప్పుకున్న లిఫ్టులు కూడా సరిగా పనిచేయలేదు. భీమా, భీమా ఫేజ్ 2, కోయిల్ సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి లాంటి లిఫ్ట్ స్కీంలతో 90 టీఎంసీల నీళ్లను వాడుకునే అవకాశం ఉంది. అయితే అన్ని చోట్లా టెక్నికల్ సమస్యలతో అవి సరిగా పనిచేయకపోవడంతో ఇంత వరద వచ్చిన కాలంలోనూ 5 టీఎంసీలకు మించి నిల్వచేసుకోలేని పరిస్థితి. మరోవైపు తొలిసారిగా ఆల్మట్టి నుండి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలారు. ఇట్లా రోజుకు 20 టీఎంసీల లెక్కన ఇరవై రోజుల్లో వందలాది టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి.
దోస్తీ.. దోపిడీ… చేతగానితనం
కృష్ణా ప్రాజెక్టులను సరిగా పట్టించుకోని రాష్ట్ర సర్కారు భారీ వరద వచ్చినప్పుడు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఓదిక్కు ఇద్దరు సీఎంల దోస్తీతో గోదావరి జలాలను మళ్లిస్తామని చెబుతుంటే… మరో దిక్కు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు నాలుగు టీఎంసీల నీటిని ఏపీ దొంగచాటుగా తరలిస్తోందని రాష్ట్ర సర్కారే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. జోక్యం చేసుకోవాలని బోర్డును కోరింది. ఇదే టైంలో వచ్చిన వరదను మన అవసరాల కోసం మళ్లించుకునే అవకాశాన్ని మాత్రం వదిలేసింది. కృష్ణాపై ఉన్న లిఫ్టులు, ప్రాజెక్టులకు కేటాయించిన నీళ్లనూ ఆపలేకపోయింది. మోటార్లు, పంపుల నిర్వహణను పట్టించుకోకపోవటం, నిధులు ఇవ్వకపోవడమే దీనికి కారణమని ఇంజనీర్లు చెబుతున్నారు.
కాల్వలే నెట్టెంపాడుకు శాపం
నెట్టెంపాడు లిఫ్ట్ లో 20 టీఎంసీల నీటిని వాడుకోవాలి. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేది టార్గెట్. దీని పరిధిలోని రిజర్వాయర్లలో 14 టీఎంసీల నీటిని నిల్వ చేయాల్సి ఉంటే ఇప్పటివరకు 3.8 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారు. మొత్తం అయిదు పంపుల ద్వారా లిఫ్ట్ చేయాలి. కానీ మూడు పంప్ లే రన్ చేస్తున్నారు. నాలుగో పంప్ అన్ చేస్తే కాలువలు తట్టుకునే పరిస్థితి లేదు. కీలకమైన టైంలో పంపులు ఆన్ చేయకుండా వారం రోజులు ఆలస్యం చేయటంతో వరద నీరంతా వృథాగా పోయింది. ఇప్పుడు రోజూ 2వేల క్యూసెక్కుల నీటిని వదులుతూ చెరువులను నింపే ప్రయత్నం చేస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ ను 2.7 టీఎంసీలతో, గుడెందొడ్డి రిజర్వాయర్ ను 0.85 టీఎంసిలతో మాత్రమే నింపారు. తాటికుంట రిజర్వాయరుకు 1.5 టీఎంసీలు, ముచ్చోనిపల్లి రిజర్వాయరుకు 1.5 టీఎంసీలు, నాగర్ దొడ్డి రిజర్వాయరుకు 0.7 టీఎంసీల సామర్థ్యం ఉన్నా చుక్కానీరు ఇవ్వలేదు. మొత్తం 103 చెరువులను నింపాల్సి ఉండగా ఆరు చెరువులను మాత్రమే నింపారు.
రిపేరుకొచ్చిన భీమా ఫేజ్ 2
జూరాల ప్రాజెక్టుకు సమాంతర కాలువ ద్వారా వనపర్తి జిల్లాలోని భీమా లిఫ్ట్ ఫేజ్ 2లో 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. రెండంచెంలుగా నీటిని లిఫ్ట్ చేయాలి. మోటార్లు మొరాయించటంతో మూడు పంపుల్లో ఒకటే నడిపిస్తున్నారు. దీంతో ఈ సీజన్ లో 30 వేల ఎకరాలకు నీరందటం కష్టంగా మారింది. శంకరసముద్రం రిజర్వాయర్ నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేయకపోవటంతో రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీటిని నింపే పరిస్థితి లేదు. కుడి కాలువకు నీరు అందక తొమ్మిది గ్రామాలలోని శంకరసముద్రం ఆయకట్టు బీడు పడిపోయింది. ఏనుకుంట రిజర్వాయర్ మినహా మిగిలిన రెండు చోట్ల నీరు అందక రైతులు తిప్పలు పడుతున్నారు.
కల్వకుర్తి మూడో లిఫ్ట్ ఫెయిల్
మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ స్కీంను టెక్నికల్ సమస్యలు వెంటాడాయి. మొత్తం 4.24 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టులో ఎల్లూరు, జొన్నలబొగడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్ల దగ్గర మూడు లిఫ్టులున్నాయి. ఇందులో 3.50 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే మూడో దశ మొరాయించింది. ఇక్కడున్న 5 పంపుల్లో మూడింటినే రన్ చేస్తున్నారు. నాలుగు, ఐదో పంపులను పనిచేయిస్తే సర్జ్‌పూల్‌లో నీటి మట్టం పడిపోతుందని ఇరిగేషన్ విభాగం వెనకడుగు వేసింది. దీంతో ఒక్క టీఎంసీ నీళ్లను లిఫ్ట్ చేయడానికి ఐదు రోజులు పడుతోంది. అన్ని పంపులు నడిస్తే రెండున్నర రోజుల్లోనే ఒక టీఎంసీ నీళ్లను తీసుకోవచ్చు. దీంతో ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన రిజర్వాయర్లు, 512 చెరువులకు నీళ్లివ్వడం అసాధ్యంగా మారింది. మూడో లిఫ్టు దగ్గర 1.2 కిలోమీటర్ల టన్నెల్ లైనింగ్ పనులు కావాల్సి ఉంటే అందులో 600 మీటర్ల మేర పెండింగ్‌లో ఉంది. దీంతో నీళ్లివ్వలేమంటూ ఇంజనీర్లు చేతులేత్తేశారు. బిల్లులు రాకపోవటంతో కాంట్రాక్టర్లు ఈ పనులు పక్కన పెట్టేశారు.
పరిహారం చిక్కుల్లో భీమా
జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన భీమా మొదటి దశ లిఫ్ట్ ఆశించినంత నీళ్లను ఎత్తి పోయలేకపోయింది. ఈ ప్రాజెక్టు కింద నారాయణపేట జిల్లా మక్తల్ నియెజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలి. 2004లో నాటి సీఎం వైఎస్ఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. కృష్ణా నుంచి గ్రావిటీ ద్వారా వచ్చిన నీళ్లను చిన్న గోప్లాపూర్ దగ్గర పంప్ చేసి సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లలోకి పోస్తారు. వరద నీళ్లను ఎత్తిపోయడంలో ఇబ్బందులు రావడంతో సంగంబండలో 2 టీఎంసీల కెపాసిటీ ఉన్నా ఒక టీఎంసీ నీళ్లే వచ్చాయి. భూత్పూర్ రిజర్వాయర్‌లో 1.09 టీఎంసీల కెపాసిటీ ఉంటే అసలు నీళ్లు ఆపకుండానే కాల్వలకు వదులుతున్నారు. ఈ కట్ట కింద ఉన్న గ్రామానికి పూర్తి పరిహారం అందకపోవటంతో సమస్యగా మారింది.
మోటార్లు ఆన్ కాని కోయిల్‌సాగర్
వరద వచ్చిన సమయంలో కోయిల్ సాగర్ ప్రాజెక్టులో మోటార్లు ఆన్ కాలేదు. జూరాల ఆధారంగా ఈ ప్రాజెక్టు కట్టారు. నర్వ మండలం ఉద్వాల దగ్గర లిఫ్ట్ చేసి, పర్దిపూర్ చెరువు, తీలేరు సర్జ్ పూల్ మీదుగా కోయిల్ సాగర్ కు నీటిని ఎత్తిపోస్తారు. దీని పూర్తి ఆయకట్టు 50 వేల ఎకరాలు. ఈసారి మోటార్లు పని చేయకపోవటంతో వరద నీటిని ఎత్తిపోసే ప్లాన్ ఫెయిలైంది. మొదటి దశలో టెక్నికల్ సమస్యలు రావడంతో నాలుగు రోజులకే రెండో దశ నిలిపివేశారు. రెండోదశలో సాంకేతిక సమస్యలు తలెత్తి పంపింగ్ ఆగిపోవడంతో ఇప్పటికీ జలాశయం సగం కూడా నిండలేదు. దీని పూర్తి సామర్థ్యం 2.09 టీఎంసీలు కాగా ఇప్పటి వరకు 0.85 టీఎంసీల నీరే నిల్వ ఉంది. అన్ని పంపులు సరిగా పనిచేసినా పూర్తి స్థాయిలో నిండాలంటే ఇంకో 25 రోజులు పడుతుంది.